రైతుల్లో ‘వాన’ందం

21 Sep, 2016 23:26 IST|Sakshi
విజయనగరంలో కురిసిన వానలో జనజీవనం
వేలాది ఎకరాల్లో వరిపంటకు ఉపయోగం
భారీగా కురవాలని కోరుతున్న రైతాంగం
 
విజయనగరం కంటోన్మెంట్‌: జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఓ చోట మోస్తరుగా.. మరో చోట కుండపోతగా కురిశాయి. సాయంత్రమయ్యే సరికి జిల్లా కేంద్రంలో మోస్తరు నుంచి భారీగా కురిసింది. కురుపాం నియోజకవర్గంలో పెద్దగా కనిపించని వర్షం పార్వతీపురంలో మాత్రం మధ్యాహ్న అర్ధగంటపాటు కురిసింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉభాలు పూర్తి చేసుకున్న రైతులకు ఈ వర్షం ఎంతో ఉపకరించింది. బొబ్బిలిలో సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. చీపురుపల్లిలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై పన్నెండు గంటల వరకూ జల్లులు కురిసాయి. మళ్లీ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఓ జల్లు కురిసింది. గజపతినగరంలో విడతలుగా చిరుజల్లులు కురిసాయి. సాలూరులో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎస్‌.కోటలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ వర్షం కురిసింది. నెల్లిమర్లలో ఉదయం నుంచి వర్షం పడుతూ తెరిపినిస్తూ కురిసింది. విజయనగరంలో ఉదయం 9 గంటల నుంచి వర్షం ప్రారంభమై పలు దఫాలుగా కురిసింది. మధ్యాహ్నం కాస్త తెరిపినిచ్చి మళ్లీ సాయంత్రం ఏడుగంటల నుంచి ఓ గంట పాటు మోస్తరునుంచి భారీగా కురిసింది. వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సందర్శకులు సాయంత్రం కురిసిన వర్షానికి ఇబ్బందులనెదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులకు కురుస్తున్న వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని మండలాల్లో చెరువులు కూడా నిండని పరిస్థితులున్న నేపథ్యంలో కురిసే ఈ వర్షాల్లోని ప్రతి నీటిబొట్టు కూడా రైతులకు అత్యవసరమని అధికారులు కూడా చెబుతున్నారు. ఇప్పటికీ జిల్లాలోని రైతులు  నాట్లు వేస్తుండటం గమనార్హం. ప్రస్తుత వర్షాలు వేలాది ఎకరాల్లోని వరిపంటకు ఉపకరించినా.. భారీ వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు