హంద్రీనీవా కాలువ వద్ద ఉద్రిక్తత

16 Jul, 2017 22:42 IST|Sakshi

– పరిహారం కోసం పనులు అడ్డుకున్న రైతులు
– అధికారులు హామీతో కొనసాగింపు


ముదిగుబ్బ : పరిహారం చెల్లించే వరకు పనులు చేయకూడదంటూ హంద్రీనీవా కాలువ నిర్మాణ  పనులను రైతులు అడ్డుకున్న సంఘటన మండలంలోని నాగారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం కాలువ పనులు చేయడానికి యంత్రాలతో కాంట్రాక్టర్‌ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో  కాపు సంఘం నాయకుడు నారాయణస్వామి, సుబ్బమ్మ, వెంకటరమణ తదితర రైతులు కాలువ నిర్మాణ పనులు జరుగకుండా యంత్రాలను అడ్డుకున్నారు. ఉదయం నుంచే కాలువ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కదిరి ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఖరీముల్లా షరీఫ్‌తో పాటు పది మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీసులు అక్కడ బందోబస్తును నిర్వహించారు.

ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ రెండు ఎకరాల  పొలంలో మామిడి చెట్లు ఉన్నాయన్నారు. పొలం మధ్యలో కాలువ Ðð వెళితే తీవ్రంగా నష్టపోతానన్నారు. కాలువ నిర్మాణంలో అలైన్‌మెంట్‌ను మార్చాలని పలుసార్లు అధికారులకు విన్నవించానన్నారు. అయితే వారు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళా రైతు సుబ్బమ్మ మాట్లాడుతు తనకున్న ఒకటిన్నర ఎకరం కాలువ నిర్మాణం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. అయితే ఇంత వరకు నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. పరిహారం చెల్లించే వరకకూ పనులు చేయకూడదంటు ఆమె పనులను అడ్డుకున్నారు.  మరో రైతు వెంకటనారాయణ మాట్లాడుతూ కాలువ కోసం ఎకరం పొలం పోతోందన్నారు. అయితే పరిహారం పంపిణీలో కొంత మొత్తం మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలిన సొమ్ము ఇవ్వలేదన్నారు. కాలువ వద్దకు పెద్దఎత్తున రైతులు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే ఉన్నతాధికారులతో చర్చించారు. వారు కొన్ని డిమాండ్లకు హామీ ఇవ్వడంతో పనులు కొనసాగించారు.

మరిన్ని వార్తలు