మేడిగడ్డ పంపుహౌజ్‌కు భూములివ్వం

16 Aug, 2016 22:27 IST|Sakshi
మేడిగడ్డ పంపుహౌజ్‌కు భూములివ్వం
  • అధికారుల వైఖరిపై రైతుల ఆగ్రహం
  • రసాభాసగా సమీక్ష సమావేశం
  • పనుల అడ్డగింత
  • రామగుండం :  మేడిగడ్డ పంప్‌హౌజ్‌ నిర్మాణానికి భూములివ్వబోమని రామగుండం మండలం గోలివాడ రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. మంగళవారం రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు రైతులతో ఏర్పాటు చేసిన రెండో దశ సమావేశం రసాభాసగా మారింది. సర్పంచ్‌ దబ్బెట రమ్య, ఎంపీటీసీ ధర్ని హైమావతి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ బి.విష్ణుప్రసాద్, డీఈ నరేశ్, ఏఈ మురళికృష్ణ, ఆర్‌ఐ ఖాజామొహినొద్దీన్‌ తదితరులు పాల్గొన్న  సమావేశంలో.. పంప్‌హౌస్‌లో భూములు కోల్పోతున్న రైతులు, భూముల్లోని ఇతర ఆస్తుల వివరాలు సర్వే నెంబర్ల ఆధారంగా తహసీల్దార్‌ శ్రీనివాసరావు సమావేశంలో వెల్లడించారు.

    సర్వేపై రైతుల అభ్యంతరం, సమావేశం బహిష్కరణ
    సర్వే అంతా తప్పుల తడకగా ఉందని పలువురు రైతులు ఆరోపించారు. తన భూమిలో ఉన్న బోర్‌వెల్‌ వివరాలు జాబితాలో రాలేదని ఒకరు, విస్తీర్ణాన్ని తగ్గించి చూపారని మరోరైతు ఆరోపించారు. స్పందించిన ఆర్డీవో సర్వేయర్‌తో మాట్లాడించారు. సాంకేతిక సమస్యలతో కొన్ని సర్వేనెంబర్లలో దొర్లిన తప్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి మళ్లీ నివేదికలు రూపొందిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి వ్యవసాయభూమిని కోల్పోయానని, పంపుహౌజ్‌లో ఇప్పుడు గుంట భూమికూడా మిగలకుండా కోల్పోతున్నానంటూ ఓ రైతు సహనం కోల్పోయాడు. దీంతో ఆగ్రహించిన తహసీల్దార్‌ అసభ్యకరంగా మాట్లాడొద్దని, నష్టం వివరాలను తమదృష్టికి తెస్తే న్యాయం చేస్తామని అన్నారు. శృతిమించి మాట్లాడితే సుంకరులతో గెంటేయించాల్సి వస్తుందని హెచ్చరించడంతో రైతులు తీవ్రంగా ఆగ్రహించారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం తహసీల్దార్‌ రైతులను చిన్నచూపు చూస్తున్నారంటూ రైతులు సమావేశాన్ని బహిష్కరించారు. పంపుహౌజ్‌ ప్రదేశంలో కొనసాగుతున్న సైటాఫీస్‌ పనులను అడ్డుకున్నారు.

    పంపుహౌజ్‌ కోసం గోదావరి ఒడ్డున సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి మరో సర్వే చేపడుతున్నారని, భూసేకరణ, నిర్మించాల్సిన ప్రదేశాలపై అధికారులు స్పష్టమైన వైఖరి వెల్లడించాలని సమావేశంలో రైతులు కోరారు. స్పందించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సుందిళ్ళలో నిర్మించే బ్యారేజితో సమ్మక్క, సారలమ్మ గద్దెల వరకు బ్యాక్‌ వాటర్‌ నిలిచి ఉంటుందని, గ్రామ రక్షణ కోసం రెండువైపులా కరకట్ట నిర్మాణానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.

    సమావేశం వాయిదాకే కొందరు రైతుల ప్రయత్నం
    – అశోక్‌కుమార్, పెద్దపల్లి ఆర్డీవో

    సమావేశాన్ని వాయిదా వేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా ధరపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశాం. అసభ్యకరమైన వ్యాఖ్యలతో తహసీల్దార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారే తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదు. శుక్రవారం మరో సమావేశం నిర్వహిస్తాం. 2013 చట్టం ప్రకారం, లేదా జీవో 123 ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం.

>
మరిన్ని వార్తలు