మాయా విత్తనం!

13 Jun, 2017 23:52 IST|Sakshi
మాయా విత్తనం!

రంగారెడ్డి జిల్లా /యాచారం: ఎంతమంది.. ఎంత దూరం నుంచి తరలినా వారి ప్రయాణ ఖర్చులు వ్యాపారులే భరిస్తున్నారు. ఆయా విత్తన ప్యాకెట్లపై సరాసరి రూ.800 ఎమ్మార్పీ ఉండగా.. రూ.500కే రైతులకు విక్రయిస్తున్నారు.మంగళవారం యాచారం మండలం నుంచి 12 మంది రైతులు వాహనాన్ని అద్దెకు తీసుకుని వెళ్లారు. ఇందుకు అయిన రవాణా ఖర్చు రూ.5వేలు. విత్తనాలు విక్రయించిన వ్యాపారే ఈ మొత్తాన్ని అందజేశాడు. భోజనం కోసం ఒక్కో రైతుకు రూ.వంద చొప్పున ఇచ్చాడు. పైగా ఎమ్మార్పీపై రూ.300 తగ్గించి రూ.500కే విత్తన ప్యాకెట్లు అమ్మారు.ఇలా 15రోజులుగా కొనుగోలు చేస్తున్న రైతులంతా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్‌ డివిజన్లలో ఇప్పటికే 5వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పత్తి సాగు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఎకరాకు రెండు చొప్పున 5 వేల ఎకరాల్లో 10 వేల ప్యాకెట్ల (450 గ్రాముల) విత్తనాలను విత్తారని అంచనా. ఒక్కో ప్యాకెట్‌కు రూ.500 చొప్పున లెక్కిస్తే.. అన్ని ప్యాకెట్లకు రూ.50లక్షలకు పైగానే ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇతర మండలాల్లో మరో 5 నుంచి 10 వేల ఎకరాల వరకు పత్తిసాగు చేసినట్లు అంచనా. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే మరో రూ.50 లక్షలకు పైగా విత్తనాల కోసం ఖర్చుపెట్టినట్లే.

అవసరాన్ని అవకాశంగా..
ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు అదునులో కురుస్తుండడం, గతేడాది పత్తికి మంచి ధర పలకడంతో.. ప్రస్తుతం రైతులు పత్తి సాగుకు అధికంగా మొగ్గుచూపుతున్నారు. వాస్తవంగా పత్తి వాణిజ్య పంట. దీంతో ఆ విత్తనాలపై ప్రభుత్వం ఎటువంటి రాయితీ ఇవ్వకపోగా, స్వయంగా విక్రయాలు కూడా చేపట్టడం లేదు. దీంతో ఆ విత్తనాల లభ్యతకు ప్రైవేటు వ్యాపారులు, డీలర్లు ప్రత్యామ్నాయంగా మారారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న వ్యాపారులు నాణ్యతను పక్కనబెట్టి.. నాసిరకం విత్తనాలను అందమైన ప్యాకెట్ల రూపంలో రైతులకు అంటగడుతున్నారు. వీటి విక్రయాల్లో తీవ్ర పోటీ నెలకొన్న కారణంగా బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ తరహా ఆఫర్లలో ‘భూత్పూర్‌’ విత్తనాలు ఒకటి.

నిత్యం పదుల సంఖ్యల గ్రామాల రైతులు అక్కడికి వెళ్లి పోటాపోటీగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.నొక్క యాచారం మండలం చౌదర్‌పల్లి గ్రామంలోనే వంద మందికిపైగానే ఆ విత్తనాలు తెచ్చుకున్నారు. జిల్లా వ్యాపారులు కూడా భూత్పూర్‌కు క్యూ కడుతున్నారు. అక్కడ తక్కువ ధరకు ప్యాకెట్లు కొనుగోలు చేసి.. ఇక్కడ ఎమ్మార్పీకి అంటగడుతుండడం గమనార్హం. స్థానికంగా పలుకబడి కలిగిన వ్యక్తులే దళారుల అవతారమెత్తి.. అమ్ముతుండడంతో విత్తనాలు నాణ్యమైనవో.. నాసిరకమైనవో తేల్చుకోకుండానే రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇతర జిల్లా సరిహద్దులు దాటి జిల్లాకు విస్తారంగా విత్తనాలు వస్తున్నా అధికారుల తనిఖీలు ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ నాణ్యమైన విత్తనాలు కాకపోతే చివరకు బలయ్యేది రైతులే. దీన్ని గుర్తించి అధికారులు సూచనలు, సలహాలు అందిస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.

మరిన్ని వార్తలు