"ఉత్తర" చూసి గంప ఎత్తారు!

23 Sep, 2016 00:00 IST|Sakshi
"ఉత్తర" చూసి గంప ఎత్తారు!

అమడగూరు : ఉత్తర కార్తె వచ్చినా చినుకు జాడ లేక పోవడంతో చీకిరేవుపల్లి గ్రామస్తులు వలస దేవర ఉత్సవం చేపట్టారు. వరుణదేవా కరుణించి మమ్మల్ని కాపాడు తండ్రీ.. అంటూ గురువారం  గామస్తులంతా వలస బాట పట్టారు. ముందుగా గ్రామంలోని రామస్వామి ఆలయంలో గ్రామస్తులు పూజలు నిర్వహించారు.  ఖరీఫ్‌ పంటలు ఎండిపోతుండటంతో ఎలా బతకాలని ఇళ్లను, పొలాలను వదిలి గ్రామస్తులంతా సామగ్రిని వెంట బెట్టుకుని అడవులకు బయలుదేరారు. దీంతో వీధులన్నీ బోసిపోయాయి.


విషయం తెలుసుకున్న గొల్లలు గ్రామ పొలిమేరలో గ్రామస్తులను అడ్డుకుని..‘అయ్యో.. మీరంతా ఊరొదిలి వెళ్లిపోతే ఇక మాకు దిక్కెవరు.. వచ్చే హస్తిన కార్తి చూసి అందరూ వెళ్దాం’ అని లబోదిబోమంటూ వారిని అడ్డగించారు. ఇక చేసేది లేక గ్రామస్తులంతా తమతో తీసుకెళ్లిన సామాగ్రితో పొలిమేరలోనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడే భోజనాలను ఆరగించి భజనలు చేసుకుంటూ సాయంత్రానికి గ్రామానికి చేరుకున్నారు.  కార్యక్రమంలో గ్రామపెద్దలు క్రిష్ణారెడ్డి, వెంకటరమణ (లెవెల్‌), భాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, నరసింహప్ప, అక్కాయమ్మ, లక్ష్మీదేవమ్మ, అమరమ్మ, సావిత్రమ్మ, రామలక్ష్ము, అశ్వర్థమ్మ, అమర మ్మ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు