రైతులను కూలీలుగా మార్చారు

19 Jun, 2017 00:23 IST|Sakshi
రైతులను కూలీలుగా మార్చారు
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ధ్వజం
- రద్దు చేస్తామని ఊరికో బెల్టుషాపు పెట్టడమేంటని ఆగ్రహం
– శింగనమలలో తల్లీకూతుళ్లు దోచేస్తున్నారని మండిపాటు 
 
అనంతపురం : రైతులను కూలీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురంలోని గుత్తిరోడ్డులో గల కేటీఆర్‌ ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ ప్లీనరీ జరిగింది. అధ్యక్షత వహించిన జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ, వరుస కరువులతో పంటలు లేక రైతులు కూలీలుగా మారుతున్నారన్నారు. ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. అధికారంలోకి వస్తే బెల్టుషాపులు రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఊరికో బెల్టుషాపు పెట్టించారన్నారు. దీంతో ప్రతి గ్రామంలోనూ శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందన్నారు. తాను ప్రజా సమస్యలు తెలుసుని  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో చేపట్టిన ‘మేలుకొలుపు పాదయాత్ర’పై ఎమ్మెల్యే యామినిబాల ఆరోపణలు చేయించారన్నారు. మరి ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని స్వయంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. తల్లీకూతుళ్లు (ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే యామినీబాల) శింగనమల నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. శింగనమలో 30 పడకల ఆస్పత్రి కట్టిస్తామని చెప్పి విస్మరించారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆస్పత్రిని తాము నిర్మిస్తామన్నారు. బుక్కరాయసముద్రం కొండమీద రాయుడు, కోటంక సుబ్రమణ్యం, గూగూడు కుళ్లాయిస్వామి, యల్లనూరు చెన్నకేశవస్వామి, శింగనమల రుష్యశృంగ ముని కొండను అభివృద్ధి చేసి పుణ్యక్షేత్రాలుగా ప్రకటిస్తామన్నారు. పరుసలు, తేర్లు, జాతర్లు వెలుగులోకి తెచ్చి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తామన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ వైపు ప్రజలు చూస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో భేదాభిప్రాయాలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలని కోరారు. సమావేశంలో రైతు విభాగం రాయలసీమ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కదలిక ఎడిటర్‌ ఇమాం, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్లు నార్పల సత్యనారాయణరెడ్డి, నారాయణరెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజనేయులు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి సునీత తదితరులు పాల్గొన్నారు.
 
 
ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారు : మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి
నయవంచన, భూభకాసురుడిలా చంద్రబాబు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకో ఏడాది పూర్తవగానే ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెడతాం. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. క్రమశిక్షణ, ఐకమత్యంతో అందరూ ఒకేతాటిపై నడుద్దాం. రైతులను ఆదుకోవడంలోను, కూలీల వలసలు నివారించడంలోను చంద్రబాబు విఫలమయ్యారు. శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. గొప్ప పరిపాలనాధ్యక్షుడిని అందించిన చరిత్ర ఈ నియోజకవర్గానిది. టీడీపీ పాలనలో దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. వీరి ఆగడాలు ఎంతో కాలం సాగవనేది గుర్తు పెట్టుకోవాలి. 
 
 
అన్ని వర్గాల ప్రజలనూ మోసగించారు : శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలనూ మోసగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 600పై చిలుకు హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళనలతో ప్రభుత్వంలో చలనం వస్తోంది తప్ప ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యకర్తలు దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. వచ్చే ఎన్నికలు మనకు చాలా కీలకం. సమష్టిగా పని చేసి జిల్లాలో రెండు ఎంపీలతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి. 
 
జేసీ పట్ల రెడ్డి కులస్తులు అప్రమత్తంగా ఉండాలి : కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి నియోజక్వర్గ సమన్వయకర్త
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి రెడ్డి కులస్తుల ఓట్లు కావాలి. వారిపై ప్రేమమాత్రం ఉండదు. వారి గురించి పట్టించుకోడు. ఇలాంటి వారి పట్ల రెడ్డి కులస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి వద్దకు వెళ్తే  ఆయన ఒక్కటే కుర్చీలో కూర్చుంటాడు. తక్కిన అందరూ నిలబడాల్సిందే. ఇదేమైనా పాలేగాళ్ల రాజ్యమా? జేసీ సోదరులు ప్రజా సేవలో కాదు దోచుకోవడంలో ఆదర్శంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఎయిర్‌పోర్డ్‌ సిబ్బందిని ప్రశ్నిస్తే కేసులు బనాయించారు. మరి జేసీ దివాకర్‌రెడ్డి ఏకంగా చేయి చేసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారు? ఇలాంటి విషయాల్లో ప్రజలకు ఎలాంటి సందేశం పుంపుతారు? వచ్చే ఎన్నికల్లో శింగనమల నుంచి పద్మావతమ్మను గెలిపిస్తేనే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు. 
 
జేసీ తాడిపత్రి ఒక్కటికే ఎంపీ కాదు : ఇమాం, కదలికి ఎడిటర్‌
జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఎంపీనే. కానీ ఆయన తాడిపత్రికి మాత్రమే ఎంపీ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. తాడిపత్రికి నీళ్లు తెచ్చుకున్నావు...మరి శింగనమలతో తక్కిన నియోజకవర్గాలకు అవసరం లేదా? ప్రతిదీ తాడిపత్రిని పట్టుకునే రాజకీయం చేస్తున్నావు. ఇది మంచిది కాదు. పద్ధతి మార్చుకో దివాకర్‌. లేదంటే ప్రజలు వారి పద్ధతి మార్చుకుని తగిన గుణపాఠం చెబుతారు. 
 
మరిన్ని వార్తలు