నోట్ల రద్దుతో రైతులు అతలాకుతలం

24 Nov, 2016 21:05 IST|Sakshi
నోట్ల రద్దుతో రైతులు అతలాకుతలం
*  వైఎస్సార్‌ సీపీ నాయకులు మేరుగ నాగార్జున, లేళ్ళ అప్పిరెడ్డి
* చేతికందిన పంట మట్టిపాలు
* పంటను కాపాడుకోలేకపోతున్న దైన్యం
 
ఇంటూరు (అమృతలూరు): పెద్దనోట్ల రద్దుతో రైతులు అతలాకుతమవుతున్నారని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మండలంలోని ఇంటూరులో గురువారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వీరభద్ర శ్రీనివాసరెడ్డి (వాసు) గృహంలో పార్టీ నాయకులతో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ తరుణంలో కూలీలకు కూలిడబ్బులు  చెల్లించేందుకు కూడా చేతిలో చిల్లర నోట్లు లేక రైతులు సతమతమవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లు చెల్లవనడంతో రైతాంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ధ్వజమెత్తారు. బ్యాంకుల ద్వారా వారానికి రూ.25 వేలు ఇస్తున్నామని ఊదరగొట్టి, వ్యవసాయ రైతులకు ఆటంకం కలిగించమని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ అమలు చేస్తున్నారో జవాబివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 
వ్యవసాయం దండగ అన్నట్టుగా వ్యవహారం..
రెండో పంటకు అదును దాటడంతో రైతుల్లో కలవరం మొదలైందన్నారు. నోట్ల రద్దు కారణంగా కనీసం విత్తనాలు కొనలేని పరిస్థితి దాపురించిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు 90 శాతం అపరాలు మినుము, పెసర విత్తనాలు సబ్సిడీపై ఇచ్చారని గుర్తు చేశారు. రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలు ఇవ్వకపోవడమే కాక, నాణ్యమైన విత్తనాలు కూడా దొరకడం లేదని, నకిలీ విత్తనాలతో రైతుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. నోట్ల రద్దు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఒకసారి స్వాగతిస్తున్నామని, రెండోసారి తిరస్కరిస్తున్నామని, మూడోసారి కలత చెందానని అనడం ఆయన స్థాయికి తగదన్నారు. రైతులకు వ్యవసాయం దండగ అన్నట్టుగానే చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు సంక్షోభంలో ఉండడంతో కోతలు అర్థాంతరంగా ఆగిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా ధాన్యాన్ని కొనిచ్చే ప్రయత్నాలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతాంగం సమస్యలపై ప్రభుత్వం చోద్యం చూస్తుంటే.. రైతాంగం తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలకు చరిత్ర లేకుండా చేస్తారన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేదంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.  
>
మరిన్ని వార్తలు