రైతులకు అండగా ఉండాలి

27 Jul, 2016 00:24 IST|Sakshi
రైతులకు అండగా ఉండాలి
  • టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క
  • వరంగల్‌ : రైతులు మనోధైర్యం కోల్పోకుండా వారికి అండగా నిలబడాలని టీడీపీ అనుబంధ తెలుగు రైతు నాయకులకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి అనసూయ(సీతక్క) సూచించారు. జిల్లా తెలుగు రైతు కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా జిల్లా రైతు అధ్యక్షులు చాడ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీతక్క మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను టీఆర్‌ఎస్‌ నాయకులు పరామర్శించిన పాపానపోలేదన్నారు. ప్రాజెక్టుల పేరిట దోపిడీకి పాల్పడుతూ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని అన్నారు.
     
    రైతు సమస్యలపై పట్టింపేదీ?
    రైతు సమస్యలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పట్టింపు లేదని, సీఎంకు ఫాంహౌస్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు అన్నారు. అవసరం లేకున్నా బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం కడుతున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ వల్ల రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. కోర్టు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు హెచ్చరించినా పట్టించుకోకుండా రాక్షస పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం, నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్, పరకాల ఇన్‌చార్జ్‌ గన్నోజు శ్రీనివాస్, జాటోత్‌ ఇందిర, జయపాల్, మన్సూర్‌హుస్సేన్, బాబా ఖాదర్‌అలీ, మార్గం సారంగం, రహీం, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, గుర్రం బాలరాజు, హన్మకొండ సాంబయ్య, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ సంతోష్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు