రైతులకు పప్పుశనగ కష్టాలు

13 Oct, 2016 22:42 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : రైతులకు పప్పుశెనగ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆధార్‌బేస్డ్‌ బయోమెట్రిక్‌ విధానంతో 27 మండలాల్లో పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే చాలా మండలాల్లో గోడౌన్లు ఖాళీ కావడంతో ఐదో రోజు పంపిణీ 12 మండలాకు పరిమితం చేశారు. విస్తీర్ణం తక్కువగా ఉన్న మండలాల్లో పంపిణీ నిలిపివేయడంతో చాలా మంది రైతులు పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చి అధికారుల్ని నిలదీస్తున్నారు. కౌంటర్ల వద్ద అధికారులు నో స్టాక్‌ బోర్డు తగిలించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్టాకు తగినంత లేకపోవడంతో గురువారం బెళుగుప్ప, బొమ్మనహాల్, పెద్దవడుగూరు, కనేకల్లు, పెనుకొండ, రొద్దం, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్, యాడికి మండలాల్లో 6,725 క్వింటాళ్లు పంపిణీ చేశారు.

విస్తీర్ణం, డిమాండ్‌ ఎక్కువగా ఉన్న పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, గుంతకల్లు వంటి మండలాల్లో స్టాకు లేక పంపిణీ చేయలేదు. మొత్తమ్మీద ఐదు రోజుల్లో జిల్లాకు కేటాయించిన 50 వేల క్వింటాళ్లలో 38,856 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి 10 వేల క్వింటాళ్ల వరకు నిల్వ ఉన్నట్లు తెలిపారు. కాగా ఆధార్‌బేస్డ్‌ బయోమెట్రిక్‌ పద్ధతిలో పంపిణీ చేస్తున్నా దళారులు, వ్యాపారులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతో చాలా మండలాల్లో విత్తన పప్పుశనగ పక్కదారి పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో రైతుకు విస్తీర్ణంను బట్టి గరిష్టంగా 25 కిలోలు కలిగినవి ఐదు బస్తాలు అంటే 1.25 క్వింటాళ్లు ఇస్తుండటంతో దళారుల పంట పండుతున్నట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో పప్పుశెనగ ధర బాగా ఉండటంతో రైతులకు ఒక బస్తాకు రూ.300 నుంచి రూ.400 ఇస్తూ అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొన్ని చోట్ల అర్హులైన రైతులకు విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు