ఆగ్రహించిన అన్నదాత

24 Aug, 2016 19:52 IST|Sakshi
ఆగ్రహించిన అన్నదాత
 వైఎస్సార్‌ సీపీ నేతృత్వంలో రైతుల రాస్తారోకో
 భీమ నది చానల్‌ చివరి భూములకు నీరివ్వాలని డిమాండ్‌
దాలిపర్రు(ఘంటసాల) :
ఆగస్టు నెల చివరి వారం వచ్చినా సాగునీరు విడుదల చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహించారు. భీమ నది చానల్‌ కింద సాగు చేసే చివరి భూములకు నీరందించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ నేతృత్వంలో మండల పరిధిలోని దాలిపర్రు పొలుగులగండి వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాస్తారోకో చేశారు. సుమారు మూడు గంటలు రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వైఎస్సార్‌ సీపీ నాయకులు అందె జగదీష్, మాడెం నాగరాజు, తుమ్మల మురళీ, మిక్కిలినేని మధు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ జూన్‌ నుంచి సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు, జలనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రకటించడంతో రైతులు బోర్ల సాయంతో 15 రోజుల క్రితం నారుమడులు వేశారని పేర్కొన్నారు. 
నేటి వరకు అందని సాగునీరు.. 
నేటి వరకు ఘంటసాల మండలంలోని భీమనది చానల్‌ శివారు దాలిపర్రు, లంకపల్లి, మల్లాయిచిట్టూరు, పూషడం, యండకుదురు, చల్లపల్లి మండలంలోని పాత మాజేరు, కొత్త మాజేరు గ్రామాలకు సాగునీరు అందలేదన్నారు. కృత్తివెన్ను, బంటుమిల్లి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. మంత్రి ఉమా మోసపూరిత ప్రకటనల వల్ల రైతులు నష్టపోయారని, ఇప్పటికైనా సాగునీటి విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి నాగార్జునసాగర్‌ ద్వారా నీరు విడుదలకు ప్రయత్నించాలని సూచించారు. రాస్తారోకో జరుగుతున్న సమయంలో బందరు ఆర్డీవో వచ్చి రైతులకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం సరికాదన్నారు. వైఎస్సార్‌ సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ రైతుల నుంచి సాగు భూములను లాక్కున్న ప్రభుత్వం వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చల్లపల్లి సీఐ వైవీ రమణ, ఘంటసాల ఎస్‌ఐ సత్యనారాయణ వచ్చి ఆందోళన విరమించాలని కోరగా.. రైతులు అంగీకరించలేదు. ఇరిగేషన్‌ మచిలీపట్నం డీఈ పాండురంగారావు వచ్చి మూడు రోజుల్లో సాగునీరందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. నీటిసంఘం అధ్యక్షుడు గువ్వాబత్తిన నాగేశ్వరరావు మాట్లాడుతూ వీరంకిలాకు వద్ద చానల్‌కు గండిపడటం వల్ల నీరు ఇవ్వడం ఆలస్యమైందని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.రమేష్, నాయకులు రామ్మోహనరావు, శ్రీనివాసరావు, అబ్దుల్‌ కరీం, రామయ్య, ఐదు గ్రామాలకు చెందినlరైతులు పాల్గొన్నారు. 
కేసు నమోదు
ముందస్తు అనుమతి లేకుడా రాస్తారోకో చేసిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, రైతులపై కేసు నమోదు చేసినట్లు ఘంటసాల ఎస్‌ఐ కేవీజీవీ సత్యనారాయణ తెలిపారు. పార్థసారథి, సింహాద్రి రమేష్‌బాబు, వైఎస్సార్‌ సీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే జగదీస్, సర్పంచ్‌ మాడెం నాగరాజు, మరో 23 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. 
  
మరిన్ని వార్తలు