రైతులకు భిక్ష వేస్తారా ?

1 Oct, 2016 21:48 IST|Sakshi
రైతులకు భిక్ష వేస్తారా ?
ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి వడ్డే మండిపాటు
భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం–2 ఇవ్వండి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూ దందా
రైతుల తరుఫున పోరాటం 
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి
మచిలీపట్నం :
 ‘భూసమీకరణలో రైతు నుంచి ఎకరం భూమి తీసుకుని 25 సెంట్ల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది... రైతులకు భిక్ష వేస్తారా?  అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. బందరు పోర్టు, పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూ దోపిడీని నిరసిస్తూ భూ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆశీర్వాద్‌ భవన్‌లో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. వడ్డే మాట్లాడుతూ బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ పేరుతో 33,601 ఎకరాలు తీసుకునేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తోందన్నారు. నిర్మాణానికి 760 ఎకరాలు చాలని, గతంలోనే 450 ఎకరాలకు పైగా భూమిని పోర్టు నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఇచ్చేసిందని, అయితే  ఇంత వరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. పోర్టును ప్రైవేటు సంస్థకు కాకుండా విశాఖపట్నం పోర్టు అథారిటీకి అప్పగించాలని కోరారు. ప్రభుత్వ భూదందాను అడ్డుకునేందుకు ప్రజలంతా అక్టోబరు 4వ తేదీలోగా ఎంఏడీఏ అధికారులకు ఫారం–2ను అందజేయాలని సూచించారు. 
రాజకీయాలు పక్కన పెట్టండి
రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా రైతులు ప్రభుత్వంపై పోరాటం చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. భూములు తీసుకునేందుకు ప్రభుత్వం కులాన్ని, మతాన్ని, పార్టీని, నాయకులను ప్రయోగిస్తుందని, అర్ధరాత్రి ఇంటి తలుపు తట్టి మంత్రులు బతిమలాడుతారని, రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. భూసమీకరణకు అభ్యంతరం తెలిపే ఫారం–2 ఇవ్వకుంటే భూసమీకరణకు అంగీకరించినట్లేనన్నారు. హైకోర్టు న్యాయవాది సుధాకరరెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్‌ రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ భూములు కాపాడుకునేందుకు రైతులకు పోరాటమే శరణ్యమన్నారు. 
 స్పష్టమైన హామీ ఇస్తేనే.. 
 భూములు తీసుకోవాలంటే రైతులకు ఎంత మేర నష్టపరిహారం ఇస్తారు, భూములు కోల్పోయిన రైతులకు ఎక్కడ భూములు ఇస్తారు, పునరావాసం ఎక్కడ ఏర్పాటు చేస్తారు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని అన్నారు. పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
 సమావేశంలో సీపీఐ (ఎంఎల్‌) కార్యదర్శి మోదుమూడి రామారావు, ఏపీ రైతు కూలీ సంఘం ప్రతినిధి యద్దనపూడి సోనీ, ఉండవల్లికి చెందిన లక్ష్మీనరసమ్మ, పెనుమాకకు చెందిన రైతు సాంబయ్య, కోన గ్రామానికి చెందిన పెదబాబు ప్రసంగించారు. భూపరిరక్షణ పోరాట కమిటీ కన్వీనరు కొడాలి శర్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాగంటి హరిబాబు, వైఎస్సార్‌ సీపీ  నాయకుడు మారుమూడి విక్టర్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. భూసమీకరణకు భూములు ఇచ్చేది లేదని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
 
 
మరిన్ని వార్తలు