నారు ధరకు రెక్కలు !

25 Aug, 2016 22:57 IST|Sakshi
నారు ధరకు రెక్కలు !
 సెంటు నారు ధర రూ.250 నుంచి రూ.650 
 కిరాయితో మరింత భారం
 దివిసీమకు వస్తున్న పామర్రు, మొవ్వ, గుడివాడ, బందరు ప్రాంత రైతులు
 
అవనిగడ్డ :
వరినారు ధరకు రెక్కలొచ్చాయి. సాగునీరు అందక చాలా ప్రాంతాల్లో రైతులు నారుమళ్లు పోయలేదు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పంటకాలువలకు నీటిని విడుదల చేయడంతోపాటు వర్షాలు కురుస్తుండడంతో నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో వరినారుకు డిమాండ్‌ పెరిగింది. సెంటు నారు రూ.250 నుంచి రూ.650 వరకు పలుకుతోంది. గత ఏడాది సెంటు నారు రూ.200 నుంచి రూ.250 మాత్రమే ఉంది. గత ఏడాది సాగునీరు సరిగా అందక పోవడం, వర్షాలు లేకపోవడంతో జిల్లావ్యాప్తంగా 30శాతం వరి సాగు చేయలేదు. ఈ ఏడాది కూడా పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. 
గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని... 
 గత ఏడాది చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి సాగునీరు వచ్చే వరకు చాలాచోట్ల నారుమళ్లు పోయలేదు. గత ఐదు రోజుల నుంచి పంటకాలువకు సాగునీరు విడుదల చేయడంతో రైతులు నాట్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన ప్రాంతాలకంటే దివిసీమలో వరిసాగు ఆలస్యంగా జరుగుతుంది. బోర్లు, మురుగునీటి సాయంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు నారుమళ్లు పోశారు. పామర్రు, మొవ్వ, గుడివాడ, మచిలీపట్నం నుంచి రైతులు నారుకోసం దివిసీమ బాట పట్టారు. గతంలో సెంటు నారు రూ.250 ధర ఉండగా.. ప్రస్తుతం రూ.650కు పలుకుతోంది. పామర్రు, మొవ్వ మండలాలకు నారు తీసుకెళ్లాలంటే రూ.1,000 నుంచి రూ.1,500 కిరాయి అవుతోంది. ట్రక్కు ఆటోకు రెండు ఎకరాలకు సరిపడా నారుపడుతుంది. కొనుగోలుతోపాటు కిరాయి కలిపి సెంటు నారు రూ.1,200 నుంచి రూ.1,500 అవుతోంది. ఇంత చెల్లించి నారు తీసుకెళ్లి నాట్లు వేస్తే పంటకాలువకు సక్రమంగా సాగునీరు వస్తుందో.. రాదో.. అని కొంతమంది రైతులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
 
>
మరిన్ని వార్తలు