సాగునీరు లేకుండా చేస్తున్నారు

27 Jul, 2017 23:44 IST|Sakshi
సాగునీరు లేకుండా చేస్తున్నారు
ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్న రైతులు
వెయ్యి ఎకరాల్లో వరినాట్లు వేయని వైనం
తరలివెళ్లిన పోలీసులు
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనులను రైతులు అడ్డుకున్నారు. వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు లేక వరినాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధానం కారణం పైప్‌లైన్‌ పనులేనని ఆరోపించారు.  విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనులకు ఆవలి పక్కనే తొర్రిగడ్డ పంపింగ్‌ స్కీమ్‌ కాలువ ఉంది. ఆ కాలువ నుంచి వచ్చే నీరు పైప్‌లైన్‌ పనులకు ఇవతల వైపున ఉన్న 1,000 ఎకరాలకు అందాలి. పైప్‌లైన్‌ పనుల వల్ల నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు ఇంత వరకూ వరినాట్లు వేయలేకపోయారు.అదీ వారి ఆగ్రహానికి కారణం. దీంతో తహసీల్దార్‌ కనకం చంద్రశేఖరరావు, కోరుకొండ సీఐ మధుసూదనరావు, ఎస్సై ఎ. వెంకటేశ్వరావు, 20 మంది పోలీస్‌ సిబ్బంది తరలివెళ్లారు. అధికారులు ఈ సందర్భంగా రైతులతో చర్చించారు. గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆగస్టు 2కు వాయిదా వేసిందని, 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తే వాటి ఆధారాలు చూపాలని ప్రభుత్వ అడ్వకేట్‌ను కోరారని, అంతవరకూ పనులు చేయడానికి వీల్లేదని రైతులు కలగర బాలకృష్ణ, కరుటూరి శ్రీనివాస్, ప్రసాద్, చల్లమళ్ళ విజయ్‌కుమార్‌ చౌదరి తేల్చి చెప్పారు. దీంతో కోర్టు ఆర్డర్‌ను పరిశీలించిన అధికారులు ఇందులో పనులు ఆపమని చెప్పలేలే అని వివరించారు. రైతులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ పనులు చేయమని ఆర్డర్‌ చూపాలని మెగా ఇంజనీరింగ్‌ ఆధికారులను నిలదీశారు. దానికి అధికారులు సరైన సమాధానం చెప్పక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు అడ్డుకునే అధికారం మీకు లేదని, కోర్టు అర్డరులో పనులు ఆపమని లేనందున పనులు యథావిదిగా చేస్తారని అధికారులు బదులిచ్చారు. అంతేగాకుండా అధికారులు పోలీసుల రక్షణలో పనులు కొనసాగించారు. వరినాట్లు వేయడానికి తొర్రిగెడ్డ పంపింగ్‌ స్కీమ్‌ ద్వారా నీరు వెళ్లడానికి పైప్‌లైన్‌ వద్ద కాలువను కలుపుతామని చెప్పి తక్షణమే పనులు చేపట్టారు. దీనితో రైతులు మద్యాహ్న 1.30 గంటలకు అక్కడ నుండి తరలి వెళ్లారు. ఎత్తిపోతల పథకం పనులు యధావిదిగా కొనసాగించారు.
మరిన్ని వార్తలు