రైతు విజయం!

19 Mar, 2017 22:52 IST|Sakshi
రైతు విజయం!

మచిలీపట్నం : తాము అధికారం చేపట్టిన ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల లింకులతో ఇప్పటివరకూ కాలయాపన చేశారు. అయినా రైతులు పోరాటాన్ని ఆపలేదు. మరోవైపు అధికారులు, ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి వెళ్లిన నివేదికల మేరకు ప్రభుత్వం మొదటిగా పోర్టు నిర్మాణం చేసేందుకు దిగి వచ్చింది. పలు మలుపులు తిరిగిన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు పోర్టు నిర్మాణానికి సంబంధించి ఓ అడుగు ముందుకు వేశారు.

15 ఏళ్లుగా ఉద్యమాలు
బందరు పోర్టు నిర్మించాలని 15 ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న బందరు పోర్టు నిర్మాణానికి ప్రాధాన్యత పెరిగింది. టీడీపీ ప్రభుత్వం పోర్టు నిర్మాణాన్ని సాకుగా చూపి పారిశ్రామిక కారిడార్‌ను నిర్మించేందుకు 2015, ఆగస్టులో 30వేల ఎకరాలను సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, పారిశ్రామిక కారిడార్‌ పేరుతో వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వబోమని రైతులు ఉద్యమించారు. తమ భూములు ఇవ్వబోమని 4,800 మందికి పైగా రైతులు ఆర్డీవోకు అభ్యంతర పత్రాలు అందజేశారు.

ఎంఏడీఏ ఏర్పాటు
భూసేకరణ నోటిఫికేషన్‌పై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తంకావడంతో 2016, ఫిబ్రవరిలో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ)ను  ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని పరిధిలో 1.05 లక్షల ఎకరాల భూమిని చేర్చారు. ఎంఏడీఏ పరిధిలోకి 426 చదరపు కిలోమీటర్లు, 28 రెవెన్యూ గ్రామాలను తీసుకొచ్చారు. భూసేకరణ అంశంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 2016, సెప్టెంబరులో 33,177 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

2008లోనే శంకుస్థాపన చేసిన వైఎస్‌
బందరు పోర్టు నిర్మాణానికి 2008, ఏప్రిల్‌ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 5,324 ఎకరాల భూమి అప్పగించేందుకు 2012, మేలో నాటి ప్రభుత్వం జీవో నంబరు 11ను జారీ చేసింది. గిలకలదిండి, బందరుకోట ప్రాంతాల్లోని 524 ఎకరాలను గతంలోనే పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. మరో 4,800 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉంది. పోర్టు పనులను దక్కించుకున్న నవయుగ సంస్థ తొలి విడతగా 2,500 ఎకరాలు అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామని గతంలోనే ప్రకటించింది. అయితే, ఈ అంశాన్ని పక్కనపెట్టిన టీడీపీ ప్రభుత్వం పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణం పేరుతో ఏకంగా 33,177 ఎకరాలను సమీకరించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది.

రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పోర్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం 3,014 ఎకరాలను కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. పోర్టు నిర్మాణం జరిగే తపసిపూడి, మంగినపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, బందరురూరల్, పోతేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎంఏడీఏ అధికారులు ప్రభుత్వ భూమి 2,360, అసైన్డ్‌ భూమి 654 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. వాస్తవంగా సాగు చేసుకుంటున్న రైతులను పక్కనపెట్టారని ఇలా అయితే భూములు ఇవ్వబోమని ఈ ఆరు గ్రామాల రైతులు చెబుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తే పోర్టు పనులు ప్రారంభానికి మార్గం సుగమం అవుతుంది.   

వైఎస్సార్‌ సీపీ, వామపక్షాల ఆధ్వర్యాన పోరాటం
ప్రభుత్వ భూదందాను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు భూపరిరక్షణ పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. రైతులతో కలిసి ప్రభుత్వ వైఖరిపై ఉద్యమించారు. రైతులకు అండగా నిలబడేందుకు, ప్రభుత్వం మెడలు వంచేందుకు వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు మచిలీపట్నంలో పలుమార్లు పర్యటించారు. పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, నిర్మాణం జరిగే ఆరు గ్రామాల పరిధిలో భూములు తీసుకుంటే రైతులు ఆశించిన మేర పరిహారం అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం సమీకరణ పేరుతో 33,177 ఎకరాలను గుంజుకుంటే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు నినదించారు. పేర్ని నాని, వామపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు కూడా ప్రభుత్వం పంపింది. అయినా రైతులు పోరాట పటిమను వీడలేదు. అధికారులు, ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి వెళ్లిన నివేదికల మేరకు ప్రభుత్వం మొదటిగా పోర్టు నిర్మాణం చేసేందుకు ఎట్టకేలకు దిగి వచ్చింది.

మరిన్ని వార్తలు