పంటలెండాయి.. ప్రాణాలు పోయాయి

14 Nov, 2015 01:37 IST|Sakshi
పంటలెండాయి.. ప్రాణాలు పోయాయి

అప్పుల బాధతో ఏడుగురు అన్నదాతల ఆత్మహత్య
 
 సాక్షి, నెట్‌వర్క్: ఎండనకా, వాననకా ఇంటిల్లిపాదీ ఆరుగాలం కష్టపడి, లక్షల్లో అప్పులు చేసి పంటలు వేస్తే.. ప్రకృతి వైపరీత్యంతో వేసిన ఆ పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు కూడా తీర్చే మార్గం లేక వేదనతో అన్నదాతలు ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లా ల్లో గురువారంరాత్రి నుంచి శుక్రవారంరాత్రి వరకు ఏడుగురు అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుండెపోటుతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన కౌలు రైతు దుగ్గిరాల ముత్యం (36) మృతి చెందాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం గాంధీనగర్‌కి చెందిన పొన్నెబోయిన నారాయణ (35)  అప్పులు తీర్చలేక మనస్తాపంతో గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు.  

మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటకు చెందిన తాడెం సత్తయ్య(40)  మూడు బోర్లు వేశారు.  సాగుకు కోసం అప్పు లు చేశారు. నీళ్లు అందక వేసిన పంటలు ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వేదనతో గురు వారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.  ఇదే జిల్లా కోహీర్ మండలం చింతల్‌ఘాట్ గ్రామానికి చెందిన కర్నె అనిల్ (40) రూ. 3 లక్షల అప్పు ఎలా తీర్చాలనే వేదనతో  శుక్రవారం ఉరేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం  ఎల్లంపేట పంచాయతీ పరిధిలోని వెనుకతండాకు చెందిన రైతు బూక్య భంగ్య(40) 2 లక్షల అప్పు తీర్చలేక ఉరేసు కున్నాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌కు చెందిన పెద్దిరెడ్డి రాంరెడ్డి(40) తనకున్న ఎకరం భూమితోపాటు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. బావిలో నీళ్లు లేక పంట ఎండిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రాంరెడ్డి గురువారం ఉదయం క్రిమిసంహారక మందు తాగాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
 
 కరెంటు వైర్లు పట్టుకొని..
 నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం నస్రుల్లాబాద్‌కి  చెందిన  గలెంక పెద్ద అంజయ్య(36) నాలుగు ఎకరాల్లో ఖరీఫ్‌లో వరిపంటసాగు చేశాడు. మూడు బోర్లు వేయించినా, రెండింటిలో నీళ్లే పడలేదు. బోరుబావుల తవ్వకం, పంటల సాగుకు రూ. 5 లక్షల అప్పు అయ్యింది. ఎండిపోతున్న పంటను చూసి అంజయ్య తీవ్ర  మానసిక క్షోభకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

మరిన్ని వార్తలు