రాజధాని రైతుల్లో గుబులు

10 Nov, 2016 02:34 IST|Sakshi
రాజధాని రైతుల్లో గుబులు

నోట్ల రద్దుతో రైతుల్లో కలవరం
4 వేల ఎకరాలకు పైగా అమ్మకాలు.. లాకర్లలో భారీగా నగదు
తాజా భూ లావాదేవీల అడ్వాన్‌‌సలు వెనక్కి ఇచ్చేస్తామంటున్న రైతులు

సాక్షి, అమరావతి: నల్లధనాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో గుబులు బయలుదేరింది. తమ భూముల్ని అమ్మి రూ.కోట్లలో బ్యాంకు లాకర్లలో రైతులు భద్రపరచడమే వారి అభద్రతకు కారణమైంది. రాజధాని ప్రకటన సమయం లో ఆ ప్రాంతంలోని భూములు రేట్లు అమాంతం పెరిగాయి. 4 వేల ఎకరాలకు పైగా లావాదేవీలు జరిగాయి. ఎకరా సగటున రూ.1.25 కోట్లకు విక్రయించారని అంచనా. ఇందులో సగం మంది రైతులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. కొందరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు.

ఇంకొందరైతే అధునాతన కార్లు, బైకులు కొనుగోలు చేశారు. మిగిలిన సొమ్మును దాచుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్న సమయంలో ఈ ప్రాంత రైతుల నుంచి డిపాజిట్లు స్వీకరించేందుకు దాదాపు అన్ని వాణిజ్య బ్యాంకులు ఇక్కడ పుట్టగొడుగుల్లా వెలిశాయి. అవి ఆశించిన మేర డిపాజిట్లు స్వీకరణ సాగలేదు. అయితే రైతుల్లో అధిక శాతం మంది లాకర్లను తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో అప్పట్లో జరిగిన భూ లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కూడా దృష్టి సారించింది. ఇప్పుడు హఠాత్తుగా రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఆ రైతులు కుదేలయ్యారు. బ్యాంకుల్లోని లాకర్లలో భద్రపరిచిన నగదును ఇప్పుడు ఎలా చలామణీలోకి తేవాలని అంతర్మథనంలో ఉన్నారు.

నిడమర్రుకు చెందిన ఓ రైతు వారం క్రితం తనకున్న ఎకరం పొలాన్ని రూ.1.25 కోట్లకు అమ్మగా వచ్చిన డబ్బు తన వద్దే ఉంచుకున్నాడు. మంగళవారం రాత్రి పెద్ద నోట్ల రద్దుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. పెనుమాకకు చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఉండవల్లిలో జరీబు పొలం కొనుగోలు చేశారు. ఇందుకు గాను ఉండవల్లి రైతుకు రూ.40 లక్షలు అడ్వాన్‌‌సగా ఇచ్చాడు. మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధం చేసుకుంటుం డగా, నోట్ల రద్దు నిర్ణయంతో రైతు హతాశుడై, వ్యాపారి తనకిచ్చిన అడ్వాన్‌‌సను వెనక్కు తీసుకెళ్లాలని బతిమాలుతున్నాడు. ఇలా ఏ రైతును కదిలించినా నోట్ల రద్దుపై బోరుమంటున్నాడు.

మరిన్ని వార్తలు