రైతు కన్నీరు తుడిచేందుకే ‘ఫసల్’

8 Apr, 2016 03:27 IST|Sakshi
రైతు కన్నీరు తుడిచేందుకే ‘ఫసల్’

జిల్లా రైతులకు ఉచితంగా పశుగ్రాసం
బీమా పథక అవగాహన సదస్సులో కేంద్రమంత్రి దత్తాత్రేయ
రైతు ఆత్మహత్యలు ఆందోళనకరం
తెలంగాణలో కరువు నివారణకు నిధులు


యాచారం : అన్నదాత కన్నీరు తుడిచేందుకే ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ - కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా గురువారం మండలంలోని గడ్డ మల్లయ్యగూడలో ఫసల్ బీమా యోజన పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని వ్యవసాయరంగా న్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రధాని కంకణం కట్టుకున్నారన్నారు. అందులో భాగంగానే రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ బీమా పథకాన్ని అమలు చేశారన్నారు.

ఈ పథకం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే తక్షణమే 25 శాతం, మిగిలిన పరిహా రాన్ని 90 రోజుల్లోపు అందిస్తారన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసి గెలిచిన వారితోనే ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగే అవకాశం ఉందన్నారు.  తెలంగాణలో కరువు నివారణకు తక్షణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.400 కోట్లు మంజూరు చేయనున్న ట్లు తెలిపారు. గొర్రెలు, మేకల కాపరులు, చేతివృత్తుల సంక్షేమానికి కేంద్రం నుంచి రూ.450 కోట్లు, గ్రామీణాభివృద్ధి కోసం రూ. 87 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. ఉపాధి కూలీలకు రెండు నెలలు కూలి డబ్బు రాలేద న్న ఫిర్యాదులు అందుతున్నాయని, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉంటే 24 గంటల్లోనే కూలి డబ్బు వారి ఖాతాలో జమచేసేలా కేంద్రం కృషి చేస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా రైతులకు ఉచితంగా పశుగ్రాసం, నీళ్లు అందించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

భువనగిరి ఎంపీ బూరనర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ఫసల్ బీమా యోజన పథకం వల్ల పట్టాదారు, పాసు పుస్తకాలున్న రైతులకే మేలు జరుగుతుందన్నారు. అయితే ఈ పథకం కౌలు రైతులకూ వర్తించేలా కేంద్ర మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 1983లో కరువు పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి పనిదినాలను 150 రోజుల నుంచి 200 రోజులకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. రెండు నెలలుగా ఉపాధి కూలీలకు డబ్బు రావడం లేదు, 24 గంటల్లో అందే విధంగా మంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఏఐసీ చీఫ్ మేనేజర్ వీవీఎస్ రావు ఫసల్ బీమా యోజన పథకం నిబంధనలపై రైతులకు అవగాహన  కల్పించారు.

రైతులకు రాయితీలకు సంబంధించి పలు బ్రోచర్లను కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి, క్రీడా-కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఎం ప్రభాకర్, ప్రసాద్, శేఖర్, ఎంపీపీ రమావత్ జ్యోతినాయక్, జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్, వైస్ ఎంపీపీ రామకృష్ణ యాదవ్, పీఏసీఏస్ చైర్మన్ నాయిని సుదర్శన్‌రెడ్డి, గడ్డమల్లయ్య గూడ, గునుగల్ సర్పంచ్‌లు నర్రె మల్లేష్, అచ్చెన మల్లికార్జున్, జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ జగదీష్, జిల్లా ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ బాబు, సరూర్‌నగర్ ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉషా, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు