ఖైదీలకు రాచమర్యాదలు

15 Sep, 2016 00:13 IST|Sakshi
ఖైదీలకు రాచమర్యాదలు

– చేయితడిపితే మందు, మాంసం,సెల్‌ఫోన్‌
– ముడుపులివ్వందే ములాఖాత్‌బి నై..
– భువనగిరి సబ్‌జైలులో నిబంధనలకు తూట్లు
– ఆగస్టు 14 వివాదమే కొంపముంచిందా
ఆ జైలులో అధికారుల చేయి తడిపితే చాలు.. రిమాండ్‌ ఖైదీలకు మద్యం, మాంసం, బిర్యాని,సెల్‌ఫోన్‌తో పాటు రాచమర్యాదలు లభిస్తాయి.. పలుకుబడి కలిగిన రిమాండ్‌ ఖైదీలు జైలుకు వచ్చారంటే చాలు అధికారి నుంచి సిబ్బంది వరకు పండగే..నిబంధనలకు తూట్లు పొడిచి సదరు అధికారులు వారికి సేవలందిస్తూ తరించిపోతున్నారు.. భువనగిరి సబ్‌ జైలులో కొంతకాలంగా సాగుతున్న ఈ తతంగం ఉన్నతాధికారులకు పొక్కడంతో బట్టబయలైంది.
– భువనగిరి
అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్నట్టు తయారైంది.. భువనగిరి సబ్‌జైలులో పరిస్థితి. నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగించేందుకు పాటు పడాల్సిన అధికారులే ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి కాసులకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు బహిరంగగానే వినిపిస్తున్నాయి. సిబ్బంది అవినీతి అక్రమాలతో కొందరు ఖైదీలకు రాచమర్యాదలు లభిస్తున్నాయని తెలుస్తోంది. వారిచ్చే డబ్బులకోసం  నిబంధనలను తుంగలో తొక్కి చికెన్, మటన్‌ బిర్యానీలు,మద్యం సరఫరా చేయడంతో పాటు వారు కోరినంత సేపు సెల్‌ఫోన్‌ మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నారని సమాచారం. దీంతోపాటు ఖైదీలు వచ్చినా పోయినా సిబ్బంది చేతులు తడపాల్సిందే.
అధికారుల విచారణతో..
ఇటీవల ఆలేరు ప్రాంతానికి చెందిన కిషోర్‌ ఓ కేసులో భువనగిరి సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. కిషోర్‌ విడుదలయ్యేటప్పుడు ఇద్దరు జైలు వార్డర్‌లు అతడి వద్ద రూ. వెయ్యి వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించగా ఆరోపణలు నిజమని తేలాయి. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు జైలు సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావుతో పాటు ఇద్దరు వార్డర్‌లు నవీన్, కిరణ్‌కుమార్‌పై బదిలీ వేటు వేశారు. అయితే ఈ విషయంలో తనకేమీ సంబంధం లేదని, అకారణంగా తనను బదిలీ చేశారని, జైళ్ల శాఖలో బాసిజం,ృవేధింపులు పెరిగాయని లేఖ రాసి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. అయితే ఆయన ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షం కావడంతో అధిృ>రులు ఊపిరిపీల్చుకున్నారు.
 వివాదం బయటపడడంతో..
 భువనగిరి సబ్‌ జైలులో పలుకుబడి కలిగిన వ్యక్తులను మహారాజుల్లా చూసుకుంటారని తెలుస్తోంది. అందుకు ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలే నిదర్శనం. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత అతని అనుచరులు కొందరిని భువనగిరి సబ్‌ జైలుకు తరలించారు. జైలులో ఉన్న నిందితులకు సకల సౌకర్యాలతో రాచమర్యాదలను జైలు సిబ్బంది సమకూర్చారని సమాచారం. వారికి హోటళ్ల నుంచి భోజనం అనుమతించారు. దీంతో పాటు సెల్‌ఫోన్‌ మాట్లాడుకోవడానికి అనుమతి ఇవ్వడంతో వివాదం అయ్యింది. అగస్టు 14 వ తేదీన సెల్‌ఫోన్‌ వివాదం ఉన్నతాధికారులకు చేరింది. దీంతో ఖైదీలను వెంటనే నల్లగొండ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా కొంత కాలంగా జరుగుతున్న వ్యవహారం బహిరంగ రహస్యమే అయినప్పటికీ తాజావివాదాలతో బయటపడింది.
సీసీ కెమెరాలున్నా..
 జైలులో సీసీ కెమెరాలు ఉన్నా అవి జైలు అవరణలో మొత్తంగా లేవు. దీంతో సిబ్బంది సహకారంతో పలుకుబడి కలిగిన ఖైదీలకు అన్ని వసతులను సమకూరుస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంటారని సమాచారం. ఖైదీలను పరామర్శించడానికి వచ్చేవారి నుంచి ముడుపులు లేనిదే ములాఖాత్‌కు కూడా అనుమతి లభించదని విమర్శలు లేకపోలేదు.
విచారణలో బయటపడినందునే..
– ఆకుల నర్సింహ, జైళ్లశాఖ ఇన్‌చార్జ్‌ ఐజీ
భువనగిరి సబ్‌ జైలులో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదు అందాయి. ప్రాథమిక విచారణలో ఆరోపణలు రుజువుకావడంతోనే జైలు సూపరింటెండెంట్, ఇద్దరు వార్డర్‌లపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బదిలీ వేటు వేశాం.  సబ్‌ జైలులో ఖైదీలకు సెల్‌ఫోన్‌ను అనుమతించ వద్దు. కొందరు సెల్‌ఫోన్‌ వాడినట్లు మా దృష్టికి వచ్చింది. వారందరినీ వెంటనే ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించాం.అవినీతిలేని జైళ్ల కోసం చర్యలు తీసుకుంటున్నాం.
 

మరిన్ని వార్తలు