ఫీజులుం

12 Jun, 2016 01:37 IST|Sakshi

ఫీజు నియంత్రణ లేక.. భారీగా దోపిడీ
బెంబేలెత్తుతున్న పేద, మధ్య తరగతి జనం
నిబంధనలకు విరుద్ధంగా ముందుగానే అడ్మిషన్లు
పట్టించుకోని విద్యాశాఖ

 

చిత్తూరు(గిరింపేట)/తిరుపతి ఎడ్యుకేషన్: ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల రూపంలో దోపిడీకి తెరతీశాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు రూ.10 వేలు నుంచి రూ.50 వేలు, పేరుపొందిన స్కూళ్లు అయితే రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు  చేస్తున్నాయి

 
జిల్లాలో 1,187ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో గత ఏడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు దాదాపు 3.20 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ ఏడాది జూన్ 13వ తేదీ నుంచి పాఠశాలలు  పునఃప్రారంభం కానున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూళ్లు ప్రారంభమైన తరువాతనే అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే అందుకు విరుద్ధంగా కొన్ని ప్రయివేటు విద్యాసంస్థలు నెల రోజుల ముందుగానే అడ్మిషన్లు ప్రారంభించాయి. కొన్ని పాఠశాలలైతే ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి  గత విద్యాసంవత్సరంలోనే అడ్మిషన్లు చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రైవేట్, కార్పొరేట్ హంగుల మాయలో పడి తమ పిల్లలను ఆ పాఠశాలల్లో చేర్పించడానికి ఆసక్తి కనబరుస్తుండడంతో అడ్మిషన్ల ప్రక్రియ ముందస్తుగానే చేపడుతున్నారు.

 
పేర్లు ఆకర్షణీయం..  ఫీజులు ఆందోళనకరం

స్కూలు పేరు ముందు, వెనుక ఎటువంటి పేర్లను తగిలించుకోకూడదన్న నిబంధనలున్నాయి. అయినా సినిమా టైటిల్స్‌లా ట్యాగ్‌లైన్లు, ఆకర్షణీయమైన పేర్లతో జిల్లాలో ఏటా కొత్త పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తునే ఉన్నాయి. ఇటీవల కాలంలో  వందల సంఖ్యలో విద్యాసంస్థలు వెలిశాయి. ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ధన, రాజకీయ బలం ఉండడంతో ఆయా పాఠశాలల జోలికి వెళ్లడానికి అధికారులు  వెనుకడుగు వేస్తున్నారన్న విమర్శలున్నాయి. 

 
కళ్లెం ఏదీ

ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సంబంధించి వసూలు చేయాల్సిన ఫీజుల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఎంత ఫీజు వసూలు చేయాలో పాఠశాలల యాజమాన్య కమిటీ నిర్ణయిస్తుంది. ఈ లొసుగును ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్  విద్యాసంస్థలు అందినకాడికి దోచుకుంటోంది.

 
కనిపించని యాజమాన్య కమిటీలు

ప్రభుత్వ  నిబంధనలు ప్రకారం ప్రతి పాఠశాల్లో యాజమాన్య కమిటీని ఏర్పాటుచేసుకోవాలి. ఇందులో అధ్యక్ష, కార్యదర్శులుగా  యాజమాన్యం ఉన్నా, హెచ్‌ఎం, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉండాలి. ఇలా ఏర్పాటైన పాలకమండలి డీఈవో ఆమోదించాలి. కానీ నేటి ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడా కూడా పాలకమండలి కమిటీ కనిపించడం లేదు. నామమాత్రంగా ఆయా పాఠశాలల యాజమాన్యం, వారి బంధువుల పేర్లతో గవర్నెంగ్ బాడీ ఏర్పాటు చేసుకుని అధిక ఫీజులను వసూలు చేస్తోంది.

 

మా దృష్టికి తీసుకురావాలి
అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లైతే సంబంధిత ఎంఈవోల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలి. అటువంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లో ఫీజుల వివరాలు, ఉపాధ్యాయ అర్హతలు డిస్ల్పే చేయాల్సిందే. నిబంధనలు పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవు. -కె.నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి

>
మరిన్ని వార్తలు