ఏ తల్లి కన్నబిడ్డో..!

1 Jun, 2016 23:49 IST|Sakshi
ఏ తల్లి కన్నబిడ్డో..!

 ఆమదాలవలస : నవమాసాలు మోసి కన్న ఆడశిశువును పాలిథిన్ కవర్‌లో పెట్టి వదిలి వెళ్లిపోయింది ఓ తల్లి. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన బుధవారం ఆమదాలవలసలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు వెంగళరావు కాలనీలో రైల్వే ట్రాకు పక్కన ఉన్న పొట్నూరు కృష్ణ ఇంటి వద్ద బాత్‌రూంలో ముక్కుపచ్చలారని పసికందును బుధవారం తెల్లవారుజామును గుర్తు తెలియని మహిళ విడిచి పెట్టివెళ్లిపోయింది.
 
 కృష్ణ భార్య ఉదయాన్నే బాత్ రూం తలుపు తీయగా పసికందు కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పి పాపకు స్నానం చేయించింది. తర్వాత వార్డు కౌన్సిలర్ రెడ్డి గౌరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వెంగళరావు కాలనీకి చెందిన కోటేశ్వరరావు, ఇందిర దంపతులకు పిల్లలు లేరని వారు పెంచుకుంటామని ముందుకొచ్చారు. దీంతో వారికి పసికందును అప్పగించారు. వారు శిశువును శ్రీకాకుళంలో ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.
 
  ఇంతలో 1098కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందిచడంతో ఐసీడీఎస్, చైల్డ్ లైన్, బాలల సంరక్షణ కార్యాలయాల నుంచి అధికారులు, సిబ్బంది కాలనీకి చేరుకున్నారు. పసి పాపను శిశుగృహకు అప్పగించాలని, లేకుంటే కేసు పెట్టాల్సి వస్తుందని జిల్లా బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ హెచ్చరించారు. దీనికి వారు ససేమిరా అనడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి సహాయంతో శిశువును శ్రీకాకుళం శిశుగృహకు తీసుకు వెళ్లిపోయారు.
 
  బిడ్డకు రక్షణ కల్పిస్తాం..
 బిడ్డకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని బాలల సంరక్షణాధికారి తెలిపారు. పిల్లల కోసం శిశుగృహకు దరఖాస్తు చేసుకున్నవారికి బిడ్డను అందిస్తామని పేర్కొన్నారు. పసికందు కన్న తల్లిదండ్రులు పూర్తి ఆధారాలతో వస్తే సమగ్ర దర్యాప్తు జరిపి వారికే అందిస్తామని తెలిపారు. ఆయనతో పాటు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జె.విజయేశ్వరి, శిశుగృహ మేనేజర్ కె.నరేష్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఎం. సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు