ఏఎస్పీ చొరవతో బతికాడు..

12 Apr, 2016 17:07 IST|Sakshi

ఏఎస్పీ చొరవ తీసుకోవడంతో.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రాణాపాయం తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బేగంపేటకు చెందిన శ్రీనివాస్(27) తీవ్రంగా గాయపడ్డాడు.

రక్తపు మడుగులో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో స్థానికులు 108కు ఫోన్ చేశారు. అదే సమయంలో కార్పొరేటర్ల సమావేశంలో సీఎం బందోబస్తుకు వెళ్లి వస్తున్న తాండూరు ఏఎస్పీ చందన దీప్తి ప్రమాదాన్ని గుర్తించి వాహనాన్ని నిలిపి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే 108కు ఫోన్‌చేశారు. కాసేపటికే.. 108 వాహనం రాక ఆలస్యమయ్యేలా ఉందని గ్రహించారు. వెంటనే క్షతగాత్రుడిని తన కారులో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు.

అతని పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీనివాస్ వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా బంధువులకు సమాచారం అందించే ప్రయత్నం చేశారు. గంటకు పైగా అక్కడే ఉండి.. వైద్యుల సూచనల మేరకు స్వయంగా ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించి అతన్ని నగరంలోని ఉస్మానియాకు తరలించారు. అనంతరం అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేశారు. దీంతో శ్రీనివాస్ ప్రాణపాయ స్థితి నుంచి బయట పడ్డాడని, అతని పరిస్థితి మెరుగైందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వికారాబాద్ సీఐ రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఒక పోలీసు ఉన్నతాధికారి అధికారి స్వయంగా దగ్గరుండి.. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ని కాపాడేందుకు కృషిచేయడం చూసి.. వికారాబాద్ వాసులు ఆశ్చర్య పోయారు.  అధికారులు ఆదేశాలు జారీ చేయడం చూశాం కానీ, ఇలా దగ్గరుండి పనిచేయడం చూడలేదని అన్నారు. ఏఎస్పీ చందన దీప్తి చొరవకు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు