సినిమా చూపిస్తున్నారు !

16 Jan, 2017 22:35 IST|Sakshi
సినిమా చూపిస్తున్నారు !

కొత్త బొమ్మ పడిందంటే ధరల మోత
పండగల సమయాల్లో అధికంగా వసూళ్లు
అటకెక్కిన ఆకస్మిక తనిఖీలు..
కనిపించని కనీస సౌకర్యాలు


మహబూబ్‌నగర్‌ క్రైం :
ఏదో కాలక్షేపం కోసం సినిమా చూద్దామని థియేటర్‌కు వస్తే అధిక ధరలతో సమస్యల సినిమా చూపిస్తున్నారు. అంతమొత్తం చెల్లించి లోపలికి వెళ్లినా చెమటలు కక్కాల్సిందే.. విశ్రాంతి సమయంలో ఏమైనా తినాలన్నా.. తాగాలన్నా అక్కడ ఉన్న ధరలతో కళ్లు తిరుగుతున్నాయి. వాహనం తీసుకెళ్తే జేబు గుల్ల అవుతుంది. ఇక మరుగుదొడ్ల వైపు వెళ్లకపోవడమే మంచిదనే రీతిలో అధ్వానంగా ఉన్నాయి. థియేటర్‌లోకి వెళ్లి అలా కూర్చున్నామో లేదో కాళ్ల పక్కనే ఆటలాడే మూషికాలు.. చిరిగిన.. విరిగినా సీట్లు.. సినిమా చూడటం దేవుడెరుగు ఎప్పుడు బయట పడుదామోనన్న పరిస్థితి నెలకొంది. ఇదీ జిల్లాలో సగానికి పైగా థియేటర్ల పరిస్థితి. మరి ఇదంతా జరుగుతుదంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఆకస్మిక తనిఖీలు ఎక్కడ జరుగుతున్నట్లు? ధరల నియంత్రణ ఎక్కడ అమలవుతున్నట్లో అధికారులకే తెలియాలి.

అధిక ధరలకు టికెట్ల విక్రయాలు
ప్రస్తుతం సంక్రాంతి పండగ సందర్భంగా పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహకులు వారి వ్యాపారం పెంచుకోవడం కోసం టిక్కెట్ల ధరలతో పాటు పార్కింగ్, క్యాంటిన్‌ ధరలు అమాంతంగా పెంచారు. ముఖ్యంగా టిక్కెట్ల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. టిక్కెట్‌పై రూ.70వేసి ప్రత్యేకంగా స్టాంప్‌తో రూ.100 ముద్ర వేసి ప్రేక్షకులతో 100 తీసుకుంటున్నారు. నిత్యం లక్షల్లో జనాల నుంచి నిర్వాహకులు దోచుకుంటున్నారు.

కనిపించని కనీస సౌకర్యాలు
జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో 50వరకు థియేటర్లున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోనే ఏడు థియేటర్లు ఉన్నాయి. అన్నిచోట్ల ధరలు అడ్డగోలుగా వసూలు చేస్తుండగా.. సౌకర్యాలు మాత్రం కరువైంది. రెవెన్యూ అధికారులు మాత్రం థియేటర్ల అనుమతికి సంబంధించి 5 విభాగాలు నిరభ్యంతర పత్రం అందిస్తుండటంతో వాటికి అనుగుణంగా రెన్యువల్‌ చేస్తున్నాం. అధిక ధరలను నియంత్రించేందుకు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నామని చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం అవి కన్పించడం లేదు.

అనుమతులు ‘మామూలే’..
ప్రతి థియేటర్‌ను ఏటా రెన్యువల్‌ చేసుకోవాలి. ఫిల్మ్‌ ఛాంబర్, ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు తీసుకొస్తే రెవెన్యూ శాఖ థియేటర్లను నడుపుకునేందుకు అనుమతినిస్తుంది. కానీ అ నుమతుల్లో మాముళ్లదే పైచేయిగా మారుతోంది. క నీస సౌకర్యాలు లేకున్నా అనుమతులిచేస్తున్నారు. భ వన సామరŠాథ్యన్ని తెలుపుతూ ఆర్‌అండ్‌బీ అ భ్యంతరం లేదని ధృవీకరించాలి. అలాగే విద్యుత్‌ సరఫరాకు సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నాయం టూ ట్రాన్స్‌కో, ఎలాంటి అగ్నిమాపక శాఖ, సినిమా ప్రదర్శించే తెరకు సంబంధించి ఫిల్మ్‌ఛాంబర్‌ అ భ్యంతరం లేదని ధ్రువీకరిస్తే రెవెన్యూ శాఖ అనుమతి ని రెన్యువల్‌ చేస్తుంది. ఆచరణలో మాత్రం చేయి తడిపారంటే అనుమతి ఇచ్చేస్తున్నారు. ఇక అధికారుల ఆకస్మిక తనిఖీ అటకెక్కింది.

జేబులు ఖాళీ..
కుటుంబంలో భార్య, భర్త ఇద్దరు పిల్లలతో సినిమాకు వెళితే పచ్చనోటు కూడా సరిపోవడం లేదు. విశ్రాంత సమయంలో క్యాంటిన్‌లో టీ, బిస్కెట్లు, సమోసాలు, శీతలపానియాలు కొనుగోలు చేస్తే బయట లభిస్తున్న ధరలకు ఐదురేట్లు అధికంగా వసూళ్లు చేస్తున్నారు. బిల్లు ఉండదు. వారి నోటికి ఎంతొస్తే అంత చెప్పడం.. ప్రేక్షకులు విధిలేక చెల్లించడం జరుగుతోంది. మరి కొత్త సినిమాలు విడుదల అవుతున్న సమయంలో మరింత దోపిడీ జరుగుతోంది. అదేవిధంగా థియేటర్లలో సైకిల్‌కు రూ.15, బైక్, కారు, ఆటోలకు రూ.30వసూలు చేస్తున్నారు. ఇవ్వకుంటే ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పోనీ వాహనాలకు భద్రత ఉందా అంటే అది లేదు. పార్కింగ్‌ రుసుంలో పేరిట ఇచ్చే రసీదులో ఎవరి సామాన్లలకు వారే బాధ్యులే అని ఉంటుంది.

మరిన్ని వార్తలు