తెలంగాణ సాధన సభకు డుమ్మా!

30 Jun, 2013 23:56 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆదివారం నిర్వహించిన తెలంగాణ సాధన సభకు జిల్లాకు చెందిన ఆ పార్టీలు నాయకులు ముఖం చాటేశారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరితో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగ జారిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం కలిగించాలనే సంకల్పంతో టీ కాంగ్రెస్ నేతలు సభ నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ ప్రాంతంలోని నేతలంతా ఈ అంశంపై ఏకతాటిపై నడచుకోవాలని నిర్ణయించి సాధన సభకు ఉపక్రమించారు. కానీ ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలు మాత్రం ఈ సభకు డుమ్మా కొట్టారు. సాధారణంగా కాంగ్రెస్ తరపున చేపట్టే పలు కార్యక్రమాలు, ముఖ్యంగా నగరంలో జరిగే కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుండి హడావుడి చేసే విషయం తెలిసిందే.
 
 ఆదివారం నిజాం గ్రౌండ్స్‌లో చేపట్టిన తెలంగాణ సాధన సభకు మాత్రం మెజారిటీ ప్రజాప్రతి నిధులు దూరంగా ఉన్నారు. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సహా జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, మరో ఎమ్మెల్సీ తెలంగాణ సాధన సభకు గైర్హాజరయ్యారు. మొదట్నుంచీ ఈ సభ పట్ల కొంత అసంతృప్తిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు జిల్లా నేతలు హాజరు కావొద్దని భావించినట్లు తెలిసింది. దీంతో ఆదివారం నాటి సభకు కొందరు ఉద్దేశపూర్వకంగా హాజరుకాలేదు. మరి కొందరు నేతలు ఇతరత్రా పనులుండడంతో హాజరు కాలేకపోయినట్లు వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
 
 పార్టీ కార్యక్రమాలు, అధికారికి కార్యక్రమాల్లో కొంత ఉత్సాహంగా పాల్గొనే మేడ్చల్ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి ఆదివారం నాటి సభకు దూరంగా ఉన్నారు. మొదట్నుంచీ ఈ సభ పట్ల అంతగా శ్రద్ధ చూపని ఈయన ఆదివారం మధ్యాహ్నం నుంచి స్థానిక నేతలకు సైతం అందుబాటులోకి రాలేదు. ఫోన్ చేసినప్పటికీ స్పందన లేదని ఓ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. దీంతో స్థానికంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ సభకు హాజరు కాలేకపోయామని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డిలు కూడా సభలో కనిపించలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి సైతం సాధన సభకు దూరంగా ఉన్నారు. మొత్తంగా నగరానికి చేరువగా ఉన్న జిల్లా నుంచే అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
 ఉత్సాహంగా సబితారెడ్డి...
 హోంమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన సబితారెడ్డి కొంత కాలంగా ప్రజా కార్యక్రమాల్లో పెద్దగా కనిపించనప్పటికీ.. ఆదివారం నాటి సభలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ కూడా సభలో కొంత హడావుడి చేశారు. తెలంగాణ అంశం పట్ల అంతంతమాత్రంగా స్పందించే కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సాధన సభలో చురుగ్గా పాల్గొని సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ తదితరులు సభకు హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు