ప్రాణాలైనా అర్పిస్తాం.. ఆక్వాపార్క్‌ను అడ్డుకుంటాం

9 Oct, 2016 02:23 IST|Sakshi
కంసాలి బేతపూడి (భీమవరం అర్బన్‌): భీమవరం మండలంలో  తుం దుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కును ప్రాణాలైనా అర్పించి అడ్డుకుంటామని కంసాలి బేతపూడి గ్రామస్తులు ప్రతినబూనారు. గ్రామంలో శనివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలి పారు. రెండున్నరేళ్లుగా ఫ్యాక్టరీ నిర్మిం చవద్దని ఆయా గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నా ప్రజాప్రతిని ధులు, పోలీసులు ఫ్యాక్టరీ యజమానులకు కొమ్ము కాయడం దారుణమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

వందలాది మంది పోలీసు బలగాలు మోహరించడంతో పాటు వారికి రాత్రింబవళ్లు షిప్టు లు వేసి మరీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రజాస్వామ్యం లో ఉన్నామా.. లేక హిట్లర్‌ నిరంకుశ పాలనలో ఉన్నామో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి తమ ఉసురు తప్పక తగులుతుందన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేవరకూ అలుపెరుగని పోరాటం చేస్తామని హెచ్చరించారు. డి.శేఖర్, పి. సాయి, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
 
మమ్మల్నీ జైల్లో పెట్టండి
ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు మా ఇంటి మగాళ్లను జైల్లో పెట్టారు. మమ్మల్ని కూడా జైల్లో పెట్టండి. రెండున్నరేళ్లుగా ఈ ప్రాంత ప్రజలందరం గొంతు పోయేలా విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతుంది.
– బెల్లపు సీత, గృహిణి, కంసాలి బేతపూడి 
 
ఇదెక్కడి న్యాయం
ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయం తీసుకుని ఏ పనైనా చేస్తారు. కాని ఇక్కడ ప్రభుత్వమే పోలీసులతో ప్రజలను చిత్రహింసలు గురిచేసి ఫ్యాక్టరీని కడతున్నారు. ఇది ఎక్కడి న్యాయం.   
– లోకం పద్మం, గృహిణి, కంసాలి బేతపూడి 
 
కోర్టులకు వెళ్తాం
మా గోడును ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు వినడం లేదు. ఫ్యాక్టరీ నిర్మించవద్దని కోర్టుల వద్ద ధర్నాలు చేస్తాం. అప్పుడైనా న్యాయం జరుగుతుందేమో మాకు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు దారుణం.  
– టి.నాగమణి, గృహిణి, కంసాలి బేతపూడి 
 
మరిన్ని వార్తలు