రైతు సమస్యల పరిష్కారానికి పోరాటం

28 Oct, 2016 00:00 IST|Sakshi
raithu
 
– ఏపీ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌
మేదరమెట్ల: ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఏపీ రాష్ట్ర  రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రథమ మహాసభ గురువారం మేదరమెట్లలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేవీవీపీ మాట్లాడుతూ సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందచేయడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ప్రయోజనాలు తక్కువగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి వి.హనుమారెడ్డి మాట్లాడుతూ  బ్యాంకుల నుంచి సక్రమంగా రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు బాచిన చెంచు ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రైతులపై నిరంకుశ ధోరణి అవలంభించడం వల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. రైతు సమస్యలపై వచ్చే నెల 15న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న ధర్నా  కార్యక్రమంలో రైతులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో తొలుత సీనియర్‌ నాయకులు గొల్లపూడి వెంకటేశ్వర్లు జిల్లాలో ఇటీవల బలవన్మరణాలకు పాల్పడిన రైతులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. కౌలురైతు సంఘం మాజీ కార్యదర్శి ఎన్‌.లక్ష్మయ్య రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సీహెచ్‌ కేశవశెట్టి, ఆహ్వాన సంఘం కార్యదర్శి వై.సింగయ్య, జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, ఎల్‌.ఆంజనేయులు, పి.అబ్రహాం,  జి.ఆదినారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు