పోర్టు కోసం పోరాడండి

11 May, 2017 18:23 IST|Sakshi

► అధికార పార్టీ నేతలూ కళ్లు తెరవండి
► దుగరాజపట్నానికి కేంద్రం చెక్‌
► అనుకూలతలు లేవన్న నీతిఆయోగ్‌
► ఇదే అభిప్రాయంలో పలు సర్వేలు
► రామాయపట్నంకు అనుకూలతలు
► చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి
► రామాయపట్నం కోసం కేంద్రానికి ప్రతిపాదన
► ఇప్పటికే వైఎస్సార్‌సీపీ, వామపక్షాల ఆందోళనలు


సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అనుకున్నట్లే జరిగింది! నెల్లూరు జిల్లాలో కేంద్రం ప్రభుత్వం నిధులతో నిర్మించతలపెట్టిన దుగరాజపట్నం పోర్టు నిర్మాణ ప్రతిపాదన నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు అనుకూలతల్లేవని, లాభదాయకం కాదని నౌకాశ్రయ రంగంతో పాటు పలు సంస్థల సర్వేలు అధ్యయనంలో తేల్చి చెప్పాయి. దీంతో దుగరాజుపట్నం ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. దుగరాజపట్నం వద్ద భారీ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇందుకోసం రూ.5,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలతల్లేవని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయించింది. తొలుత రైట్స్‌ సంస్థ ప్రాథమిక సర్వే   జరపగా, ఆ తర్వాత ఈ అండ్‌ వై సంస్థ పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మేకింగ్‌సె, ఏఈకామ్‌ అనే సలహా సంస్థలతో దీనిపై అధ్యయనం చేయించింది.

అక్క్డన్నీ ప్రతికూలతలే...
దుగరాజపట్నం పోర్టు నిర్మించినా ఉపయోగం లేదని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ప్రతిపాదిత పోర్టు స్థలం పక్కనే ప్రఖ్యాత పులికాట్‌ సరస్సు ఉండటంతో పరిసరాల్లో వేరే పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు. పర్యావరణ అనుమతులు లభించడం కష్టమే. మరోవైపు శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఉంది. పోర్టు కార్యకలాపాలు నిరంతరాయంగా నిర్వహించడానికి ఇది అడ్డంకిగా మారుతోంది. ఇక దుగరాజుపట్నం పోర్టుకు 30 కి.మీ. దూరంలోనే కృష్ణపట్నం పోర్టు ఉంది.

ఇక దుగరాజుపట్నం పోర్టుకు రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న 40 కి.మీ. దూరం ఉంది. జాతీయ రహదారితో అనుసంధానించాలన్న భారీ వ్యయంతో కూడుకున్న పనే. ఇన్నీ ప్రతికూలతల మధ్య రూ.5,500 కోట్లు ఖర్చు చేసిన దుగరాజుపట్నం పోర్టు లబ్ధి అంతంతమాత్రమే. ఈ కారణాలతో పోర్టు నిర్మాణం సాధ్యం కాదని నీతిఆయోగ్‌ ఉన్నతాధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో అంతే విలువైన మరో నౌకాశ్రయాన్ని ఎంపిక చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించేందుకు కేంద్రం సిద్ధమైంది.

రామాయపట్నం పోర్టుకు అనుకూలతలు:
దుగరాజుపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలతలు లేకపోవడంతో ప్రకాశం జిల్లా నేతలు గట్టిగా కోరితే రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఇదే అదునుగా జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి. ఆ తర్వాత నేతలందరూ మూకుమ్మడిగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కృషి చేయాలి.
ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు రామాయపట్నం పోర్టు కోసం ఉద్యమం కొనసాగిస్తున్నాయి.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాలరెడ్డి కావలి నుండి రామాయపట్నం వరకు పాదయాత్ర సైతం నిర్వహించారు. ఇక వామపక్షాలు రామాయపట్నం కోసం ఉద్యమాన్ని చేపట్టాయి. అందరూ కలిసికట్టుగా పోరాడితే జిల్లాకు పోర్టు రావడం ఖాయం.  రామాయపట్నం పోర్టు నిర్మిస్తే కరువు, మెట్ట ప్రాంతమైన ప్రకాశంతో పాటు పరిశ్రమలకు అనువైన సంపద ఉన్న నెల్లూరు, రాయలసీమ జిల్లాలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తద్వారా పోర్టు సైతం అభివృద్ధి చెందుతుంది.

పోర్టుతో ప్రయోజనాలెన్నో...
రామాయపట్నంలో పోర్టు కమ్‌ షిప్‌యార్డు నిర్మించాలన్న ప్రతిపాదన ఆది నుంచి ఉంది. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రామాయపట్నంలో పోర్టును నిర్మించాలని సిఫార్సు చేసింది. ఇదే గనుక జరిగితే పారిశ్రామికవేత్తలు ఇక్కడకు పెద్ద ఎత్తున తరలివస్తారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది.

లక్ష కోట్ల పెట్టుబడులతో భారీ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ స్థాపనకు దుబాయ్‌ కంపెనీ సిద్ధంగా ఉంది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు రానున్నాయి. లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వాటికి అనుబంధంగా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధిని సాధిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రకాశం జిల్లా నేతలు పార్టీలకతీతంగా రామాయపట్నం పోర్టు కోసం పోరుబాట సాగించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు