హెచ్‌ఎంల కౌన్సెలింగ్‌లో రగడ!

18 Apr, 2017 23:39 IST|Sakshi
హెచ్‌ఎంల కౌన్సెలింగ్‌లో రగడ!

– అడ్డుకున్న గిరిజన ఉపాధ్యాయులు
– పోలీసుల రంగ ప్రవేశం
– ఎట్టకేలకు పూర్తయిన కౌన్సెలింగ్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌ : స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు మంగళవారం స్థానిక కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ‘అడక్వసీ’(సంపూర్ణత)పై రగడ చోటు చేసుకుంది. అడక్వసీ మేరకు తమకు ఏడు పోస్టులు ఇవ్వాలని గిరిజన ఉపాధ్యాయులు పట్టుబట్టగా, నిబంధనల ప్రకారం మూడు పోస్టులు మాత్రమే వస్తాయంటూ డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు. దీనిపై సుమారు గంటపాటు వాదనలు జరిగాయి. వాస్తవానికి సాయంత్రం ఐదు గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాలి. జిల్లాలోని 375 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు గాను 6 శాతం రిజర్వేషన్‌ ప్రకారం (అడక్వసీ) గిరిజన ఉపాధ్యాయులకు 23 పోస్టులు వస్తాయి. ప్రస్తుతం 16 మంది పని చేస్తున్నారు.

తక్కిన ఏడు పోస్టులను ఈ కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేయాలని గిరిజన ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. నిబంధనల ప్రకారం ఒకేసారి అన్ని పోస్టులు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రస్తుతం మూడు పోస్టులు భర్తీ చేస్తామని డీఈఓ చెప్పారు. జూన్‌లో 20 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, అప్పుడు తక్కిన పోస్టులు ఇస్తామని వివరించారు. ఇందుకు వారు ససేమిరా అన్నారు. తమకు హక్కుగా రావాల్సిన అన్ని పోస్టులు వెంటనే భర్తీ చేయాలని పట్టుబట్టారు. డీఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు తక్కిన ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ జరపాలంటూ డిమాండ్‌ చేశారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  అప్పటికే చేరుకున్న టూటౌన్‌ ఎస్‌ఐ తమీమ్‌అహమ్మద్‌ జోక్యం చేసుకున్నారు. టీచర్లెవరూ గొడవ పడొద్దని, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. అనవసరంగా గొడవ చేస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా కల్పించుకుని అందరికీ సర్దిచెప్పారు. తుదకు రాత్రి 7.45 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమై.. 8.45కి పూర్తయ్యింది.

మరిన్ని వార్తలు