ప్రజా సమస్యలపై మరో పోరాటం చేయాలి

17 Sep, 2016 00:48 IST|Sakshi
  • - సినీ హీరో మాదాల రవి
  • - ఖిలావరంగల్‌లో పీఎన్‌ఎం ఆధ్వర్యంలో వీధి నాటకోత్సవం
  • - ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు
  • కరీమాబాద్‌ : ఆనాటి పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై మరో పోరాటం చేయాలని అభ్యుదయ సినిమాల హీరో మాదాల రవి అన్నారు. ఖిలావరంగల్‌ చమన్‌ వద్ద ప్రజానాట్య మండలి ఆద్వర్యంలో తెలంగాణ విమోచన దినం పురస్కరించుకుని శుక్రవారం వీధి నాటకోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
    ఈ సందర్భంగా హాజరై రవి మాట్లాడుతూ ఆనాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా వెట్టిచాకిరి పోవాలని, దున్నే వాడికే భూమి కావాలని ఎర్రజెండా అండతో పేదలంతా పోరాటం చేశారన్నారు. ఇందులో సుమారు 4 వేల మంది అమరులయ్యారని రవి గుర్తు చేశారు. దీంతో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని చెప్పారు. నేడు తెలంగాణ ప్రాజెక్టులు, పరిశ్రమల పేరిట అభివృద్ధి అంటూ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ప్రజల భూములను లాక్కోవడం జరుగుతోందన్నారు. అనంతరం పీఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డ భిక్షమయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మళ్లీ పేదల భూములు లాక్కోవాలని చూస్తుందని, ప్రజలందరూ దీనిని వ్యతిరేకిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  ప్రభుత్వం కళలను ప్రోత్సహించడం లేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో కార్పోరేటర్‌ సోమిశెట్టి శ్రీలత,  మర్రి శ్రీనివాస్‌, కొప్పుల శ్రీను, మైదం నరేష్‌,  భోగి సురేష్‌, పల్లం రవి, డి. రవి, ఎస్‌.ప్రవీన్‌కుమార్‌, ఆరూరి కుమార్‌, సారంగపాణి, యుగేందర్‌, వేణు, అనిల్‌, దశరద్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
    కళ్లకు కట్టిన ప్రదర్శన
    వీధి నాటకోత్సవాల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన వీర తెలంగాణ పోరాటం, ఆసరా, చరుతల రామాయణం, మొదలైన కళారూపాలు ఆహుతులను అలరించాయి. అలాగే ఆనాటి పోరాటం కళ్లకు కట్టినట్లు చూపించడం ఆలోచింప చేసింది. కళాకారుల డప్పు చప్పులు, నృత్యాలు అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాయి.
     
    16డబ్ల్యూజిఎల్‌106- : వీధినాటకోత్సవాల్లో మాట్లాడుతున్న అభ్యుదయ సినీ హీరో మాదాల రవి
    16డబ్ల్యూజిఎల్‌ 111 - ఖిలావరంగల్‌ చమన్‌ వద్ద కళాకారుల ప్రదర్శన
మరిన్ని వార్తలు