ఉద్రిక్తం

25 Nov, 2016 23:32 IST|Sakshi
ఉద్రిక్తం
  • ఎంపీఆర్‌ ఆయకట్టుకు నీటి కోసం పోరు
  • ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు సంఘాల ధర్నా
  • నాయకులు, రైతుల అరెస్ట్‌, విడుదల
  • మధ్యపెన్నార్‌ రిజర్వాయర్‌ (ఎంపీఆర్‌) కింద ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. పాలకులు, అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ అఖిల పక్ష పార్టీల నాయకులు, రైతులు, రైతుసంఘాల నేతలు స్థానిక ఓవర్‌బ్రిడ్జి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఇక్కడి  నుంచి కదిలేది లేదంటూ భీష్మించారు. హెచ్చెల్సీ లోకలైజేషన్‌ ఈఈ వెంకటరమణారెడ్డి  వచ్చి నీటి ఖర్చుపై పొంతనలేని లెక్కలు చెప్పడంతో నాయకులు, రైతులు తిరగబడ్డారు. 45 నిమిషాల పాటు అక్కడే బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర  అంతరాయం ఏర్పడింది.  దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా  అరెస్టు చేసి, టూటౌన్‌  స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

    బాబూ..గతాన్ని గుర్తుకు తెచ్చుకో : అనంత

    వరుస కరువులతో అల్లాడుతున్న రైతులను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీఎంపీ అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. రైతుల శాపంతో గతంలో తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా  ఆయనకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో అనంత మాట్లాడారు.గతంలో జిల్లాకు 26 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పుడు హెచ్చెల్సీ ఆయకట్టుకు, చెరువులకు, తాగునీటికి ఇచ్చారని గుర్తు చేశారు. మరి ఈ ఏడాది 30 టీఎంసీల దాకా నీళ్లొచ్చాయని, కనీసం ఒక్క ఎకరాకైనా ఇచ్చారాఽ అని ప్రశ్నించారు. వచ్చిన నీటిని ఎక్కడికి కేటాయించారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన భూములకు లబ్ధి చేకూరేందుకు చాగల్లు రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకెళుతున్నారని, మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలో కొన్ని చెరువులకు తీసుకెళ్లారని అన్నారు.  జేసీ, మంత్రి  సునీత వ్యవహారం చూస్తుంటే పాలేగాళ్ల రాజ్యాన్ని గుర్తు చేస్తోందన్నారు. అంగబలం, «ధనబలం ఉన్నవారికే నీళ్లనే పరిస్థితి దాపురించిందన్నారు. జిల్లా కలెక్టర్, హెచ్చెల్సీ ఎస్‌ఈ ఇద్దరూ అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్నారని మండిపడ్డారు.  రైతులకు  అన్యాయం చేస్తే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

    పోరాటాలతోనే నీటి సాధన

    ఆయకట్టు రైతులు నీటికోసం అల్లాడుతుంటే అధికార పార్టీ నేతలేమో ముఖ్యమంత్రి వద్దకు పంచాయితీకి వెళ్లారని సీపీఎం రాష్ట్ర నేత ఓబులు ఎద్దేవా చేశారు. ‘ఎంపీ దివాకర్‌రెడ్డి నగరంలో చిత్తుపేపర్ల పంచాయితీ చేస్తున్నారు. మంత్రి సునీతకు ధర్మవరంలో ఫ్లెక్సీలో ఫొటో గొడవే సరిపోతోంది. మనం ఇలాగే కూర్చుంటే లాభం లేదు. అందరం కలిసి గడ్డపార, గడారు తీసుకుని డ్యాంకు వెళ్లాల్సిందే’నని  పిలుపునిచ్చారు.  డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అన్ని వర్గాలను వంచిస్తున్నాయన్నారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఆ పార్టీ నేత జాఫర్‌ మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు రైతు గోడు పట్టడం లేదన్నారు. అన్ని మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే సరిపోతుందా? సహాయక చర్యలేవీ అని ప్రశ్నించారు. దివాకర్‌రెడ్డి తాడిపత్రి, అనంతపురం నగరానికి మాత్రమే ఎంపీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన స్వలాభం కోసమే  అధికారులను భయపెట్టి చాగల్లు రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకెళ్లారని మండిపడ్డారు. శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఎంపీఆర్‌ ద్వారా ఉత్తర, దక్షిణ కాలువల పరిధిలోని ఆయకట్టుకు నీళ్లిచ్చేదాకా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మీసాల రంగన్న, నార్పల సత్యనారాయణరెడ్డి, వీరాంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, రైతు విభాగం  జిల్లా అధ్యక్షుడు నాగరాజు, జంగాలపల్లి పెద్దన్న,  సీపీఐ రైతు విభాగం నాయకులు కాటమయ్య, గోపాల్, కాంగ్రెస్‌ నాయకులు  కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు