అధికార పార్టీలో ఆధిపత్య పోరు!

31 Jul, 2015 03:05 IST|Sakshi
అధికార పార్టీలో ఆధిపత్య పోరు!

సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో సంస్థాగతంగా ఆధిపత్య పోరు సాగుతోందా..? అధికార పార్టీ హోదాతో తమకేదో జరిగిపోతుందని ఆశపడిన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారా..? పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం, జిల్లాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమధానం ఇస్తున్నాయి! గడిచిన పధ్నాలుగేళ్లుగా ఒకే పార్టీలో సహచరులుగా కొనసాగిన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు సమాచారం. వీరిలో కొందరికి ఉన్నత పదవులు దక్కడం, మరికొందరికి ఏవో కొన్ని పదవులు దక్కినా ప్రోటోకాల్ ప్రకారం వెనకపడడం వంటివి నేతల మధ్య అంతరాలకు కారణంగా చెబుతున్నారు.

ఫలితంగా ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి తలెత్తింది. దీంతో ఆయా నేతలను అనుసరిస్తున్న కార్యర్తలూ రెండు వర్గాలు విడిపోయారు. అలాగే పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, వారిని అనుయాయులకు, పాత వారి మధ్య సఖ్యత కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక విధంగా జిల్లాల్లో నాయకులు ఎవరికి వారుగా రాజకీయం నడుపుతున్నాని విశ్లేషిస్తున్నారు.
 
మంత్రులదే హవా..
మెజారిటీ జిల్లాల్లో మంత్రులదే ఇష్టారాజ్యంగా నడుస్తోంద న్న అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నామమాత్రంగా మారారని, ప్రతీ పనికి మంత్రి ఆమోదం ఉంటే కానీ సంబంధిత అధికారులు పలకడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా అంతోఇంతో ఆర్థికంగా నిలదొక్కునేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలకూ మంత్రులు మోకాలడ్డుతున్నట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు ఉన్న జిల్లాల్లో ఆధిపత్య పోరు తక్కువగా ఉన్నా.. ఒకే మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాల్లో అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరాయంటున్నారు.

అధికార పార్టీ నేతలు ఎంత కాదని చెబుతున్నా.. చెరువుల పూడిక తీత కోసం మొదలు పెట్టిన మిషన్ కాకతీయ పథకంలో అత్యధిక పనులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అనుచరులకు, వారు చెప్పిన వారికే దక్కాయి. కానీ కొందరు మంత్రులు అడ్డం పడిన చోట మాత్రం ఇది సాధ్యం కాలేదు. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాల్లో ఒక ఎమ్మెల్సీ తన కార్యకర్తలకు ఒకటీ, అరా పనులు ఇప్పించుకున్నారు. ఇది అక్కడ్నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు గిట్టలేదు. మిషన్ కాకతీయ పనులు ఎట్టి పరిస్థితుల్లో సదరు ఎమ్మెల్సీ అనుచరులకు ఇవ్వొద్దని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. చివరకు ఈ పంచాయితీ  సాగునీటి శాఖ మంత్రి పేషీకి చేరినా ఉపయోగం లేకుండా పోయిందని సమాచారం.
 
తలలు పట్టుకుంటున్న ద్వితీయ శ్రేణి నేతలు
రాష్ట్రస్థాయిలోనే ఇద్దరు మంత్రులు రెండు వర్గాలుగా ఉంటున్నారన్న ప్రచారం పార్టీలో ఉంది. ఈ ఇద్దరికీ అనుచరులు వేర్వేరుగా ఉన్నారు. ఈ ప్రభావం కింది స్థాయి దాకా ఉందని, నాయకుల మధ్య సయోధ్య లేక పోవడం తమకు ఇబ్బందిగా మారిందని, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఒక మంత్రి తన సహచరులకు, చివరకు తన సొంత నియోజకవర్గం వారికీ స్వేచ్ఛగా ఏ పనీ చేయలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఉత్తర తెలంగాణలోని ఒక జిల్లాలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి.

రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ ఇబ్బందులను పార్టీ అధినేత దృష్టికి తీసుకుపోలేక, కార్యకర్తలకు సర్ది చెప్పుకోలేక సతమతమవుతున్నామని నాయకులు వాపోతున్నారు. చివరకు జిల్లాల్లో పార్టీకి కొత్త కార్యవర్గాలనూ నియమించలేని పరిస్థితి ఉంది. ‘రాష్ట్ర స్థాయిలోనే కమిటీలను వేయలేదు. జిల్లాలో అవసరమా’ అని పార్టీ మొత్తాన్ని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, జిల్లా అధ్యక్షులు కూడా నామమాత్రంగా మారారని కొందరు నాయకులు ఆవేదన  వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు