ఖైదీ నెం.150 అభిమానులకు పండుగ

7 Sep, 2016 22:16 IST|Sakshi
ఖైదీ నెం.150 అభిమానులకు పండుగ
కొవ్వూరు రూరల్‌/ చాగల్లు : చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెం.150వ సినిమా గురించి ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం ఆయన చాగల్లు విచ్చేశారు. చాగల్లుతో పాటు ఐ.పంగిడి గ్రామంలోని గణపతి పందిళ్లలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీ పేరుతో చిరంజీవికి సూపర్‌ హిట్‌ చిత్రాలు లభించాయని, ప్రస్తుత సినిమా కూడా సూపర్, డూపర్‌ హిట్‌ అవుతుందని ఘంటా పథంగా చెప్పారు. అభిమానులు పండుగ చేసుకునేలా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా ఆయనతో చేసిన ఇంటర్వూ్య ఇలా బోలెడు విషయాలు తెలిపారు. 
ప్ర : చిరంజీవి 150వ సినిమా ఎలా ఉండబోతోంది?
జ : అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది. సందేశంతో పాటు కామెడీ, డ్యాన్స్, ఫైట్లు ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం.
ప్ర:సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఏమిటి?
జ: ముఖ్యంగా తారాగణం. హీరోయిన్‌గా కాజల్, సీనియర్‌ నటులు బ్రహ్మానందం, రఘుబాబు వంటి వారు ఆకర్షణగా నిలుస్తారు. 
ప్ర: చిత్రీకరణలో ప్రత్యేక జాగ్రత్తలు ఏమి తీసుకుంటున్నారు?
జ: చిరంజీవి ఓల్డేజ్‌ హోంలో పనిచేస్తారు. ఈ సీన్లు రియల్‌గా ఉండాలన్న ఉద్దేశంతో నిజమైన ఓల్డ్‌ ఏజ్‌ హోం నుంచి నటనపై ఆసక్తి ఉన్న వద్ధులను సినిమా కోసం తీసుకువచ్చాం. అంత జాగ్రత్తగా చిత్రీరణ చేస్తున్నాం.
ప్ర: సినిమా చిత్రీకరణ ఎంతవరకూ పూర్తయ్యింది?
జ: అరవై శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఇంకా పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది. రెండు పాటలు మాత్రం ఇతర దేశాల్లో చిత్రీకరిస్తాం. వచ్చే ఏడాది భోగి నాడు సినిమా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం.
ప్ర: ఈ సినిమాలో చిరంజీవి చాలా యంగ్‌గా కన్పిస్తున్నారు. దానికి కారణం?
జ: చిరంజీవి సినిమాను ఎంతగా ప్రేమిస్తారో మన అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రతి సీనులోను ఆయనలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఫైట్స్, డ్యాన్సుల్లో వారం రోజులు షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తే ఆయన మూడు రోజుల్లోనే చేసేస్తున్నారు. అంత ఉత్సాహంగా ఉన్నారు. దీంతో ఈ సినిమాలో ఫైట్లు డూప్‌ లేకుండా చిత్రీకరించాం. పాత చిరంజీవిని అభిమానులు మళ్లీ చూస్తారు. 
ప్ర: మీ సినిమాకు ఖైదీ నెం.150 పేరు పెట్టడానికి కారణం?
జ: ఈ సినిమాలో ఖైదీ నెం.150 అనే డైలాగ్‌ ఉంది. దీంతో ఎవరో నెట్‌లో ఇదే సినిమా పేరుగా పెట్టారు. దర్శకుడు దాసరి నారాయణ లాంటి పెద్దలు ఈ పేరైతేనే బాగుంటుంది అని చెప్పడంతో దానిని ఖరారు చేశాం. 
ప్ర: షూటింగు బిజీలో ఉండగా ఇక్కడకు రావడం?
జ: షూటింగుకు ఒక రోజు స్వల్ప విరామం వచ్చింది. చిరంజీవి కేరళ వెళ్లడంతో కొంత ఖాలీ దొరికింది. ప్రతి వినాయక చవితికి మా సొంత ఊరు చాగల్లు రావడం అలవాటు. దీంతో రెక్కలు కట్టుకుని వాలిపోయా. ఇక్కడకు వచ్చిన తరువాత నా స్నేహితులు, బంధువులు, ఇక్కడి పెద్దలన కలిసిన తరువాత వెళ్లాలనిపించడం లేదు. అయినా తప్పదుగా... వీలు చూసుకుని చవితి ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మళ్లీ వస్తా. 
 
 
 
మరిన్ని వార్తలు