ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి

3 Jul, 2016 20:12 IST|Sakshi

విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ. 500 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాలులో సంఘం సమావేశం ఆదివారం జరిగింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నంబర్ 85 ద్వారా విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేసినప్పటికీ తర్వాతి కాలంలో దానిని ఫెడరేషన్‌గా మార్చారని చెప్పారు.

 

నూతన రాజధాని అమరావతిలో కాలజ్ఞానకర్త వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరారు. విశ్వబ్రాహ్మణుల్లో అర్హులైన నిరుపేద విద్యార్థులకు ఎల్‌కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. యాభై ఏళ్లు పైబడిన విశ్వకర్మలకు రూ. 2వేలు పింఛను ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ గృహకల్ప పథకం ద్వారా నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

ప్రధాన కార్యదర్శి నాగులకొండ అశ్లేషాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాతినిధ్యం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం త్వరలో విశాఖపట్నంలో 50 వేల మందితో విశ్వబ్రాహ్మణ గర్జన ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం నాయకులు ధనాలకోట కామేశ్వరరావు, యువజన విభాగం అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్, శ్రీనివాసాచారి 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు