స్వాగతిస్తున్నా

8 Sep, 2016 02:33 IST|Sakshi
స్వాగతిస్తున్నా

అరుణ్ జైట్లీ ప్రకటనపై బాబు ఇచ్చినదానికి అభినందిస్తున్నా
చేయాల్సినదానికి చట్టబద్దత కల్పించండి
హోదా సాధ్యం కాదంటున్నారు
కాబట్టి ఎంతివ్వాలో అంతివ్వండి

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రాష్ట్రానికి అందించిన సహాయానికి అభినందిస్తున్నానని, ఇకపై అందిచాల్సిన సహాయానికి చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామంటే సంతోషమని, ఒకవేళ హోదా ఇవ్వలేకపోతే దానికి సమానంగా నిధులు ఇవ్వాలని కోరారు. లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించలేమని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన  ప్రకటనపై బుధవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు మంత్రులతో కేంద్రం చేసిన ప్రకటనపై సుదీర్ఘంగా చర్చించారు.

విలేకరుల సమావేశంలో యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, కె.అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. జైట్లీ విలేకరుల సమావేశంలో ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పారని, పోలవరానికి వందశాతం నిధులిస్తామని హామీనిచ్చారని, రెవెన్యూలోటు మూడు సంవత్సరాల్లో భర్తీ చేస్తామని చెప్పారని చంద్రబాబు తెలిపారు. జాప్యం లేకుండా వెంటనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలన్నారు. ఈ విషయంలో గొడవలు పెట్టడం సరికాద న్నారు. రాష్ట్రాభివృద్ధికి  ఎవరు సహకరించినా అభినందిస్తానని చెప్పారు. కొందరు రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడటంతో పాటు చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

కేంద్రం ప్రకటనపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూద్దామన్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన రాయితీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రానికి అవసరమైనపుడు నిధులు ఇవ్వాలని, రాష్ర్టం స్థిరపడిన తరువాత నిధులు ఇస్తే ఏం లాభముంటుందని ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీ లాంటిది ఇవ్వడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. రాజధానికి ప్రస్తుతం రూ.వెయ్యికోట్లు ఇచ్చారని, ఇంకా రూ.1500 కోట్లు ఇస్తామంటున్నారని, అది ఏ మాత్రమూ సరిపోదని చెప్పారు. రాజధాని అంటే భవనాల నిర్మాణం కాదన్నారు. అసెంబ్లీలో సీట్ల పెంపు, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటును వేగవంతం చేయలని ఆయన కోరారు.

>
మరిన్ని వార్తలు