షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీలో భారీగా అక్రమాలు

2 May, 2016 08:45 IST|Sakshi

- అనర్హులకూ ఆర్థిక సాయం
- దరఖాస్తుదారుల ఇళ్లకు అధికారులు
- ఇప్పటికే షాదీ ముబారక్‌లో 11 కేసులు నమోదు
- తూర్పున విస్తృత విచారణ
- అక్రమార్కుల్లో వణుకు
 మంచిర్యాల

 సంక్షేమ ఫలాలు అక్రమార్కుల పాలయ్యాయి. పేదలకందాల్సిన ఆర్థిక సాయం పక్కదారి పట్టింది. పెళ్లి చేసుకోకుండానే కొందరు.. పెళ్లయి ఏళ్లు గడిచిన తర్వాత ఇంకొందరు.. ఇలా ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టి డబ్బులు కాజేశారు. మరోపక్క పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చేరాల్సిన ఆర్థిక సాయాన్నీ కొందరు కాజేశారు. ఎంతోమంది దళారులు, కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకున్నారు.

 

జిల్లాలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ పథకంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల్లోనే షాదీ ముబారక్ పథకంలో అవినీతి నిరోధక శాఖ 11 కేసులు నమోదు చేసింది. తాజాగా.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతీ, యువకుల వివాహాలకు సంబంధించిన కల్యాణలక్ష్మీ పథకంపైనా దృష్టి సారించిన ఏసీబీ అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఉట్నూరు, జైనూర్, నార్నూర్, మంచిర్యాల, మందమర్రి, కాసిపేట మండలాల్లో విచారణ పూర్తి చేశారు. మరో రెండ్రోజుల్లో తూర్పు ప్రాంత పరిధిలోని అన్ని మండలాల్లో ఉన్న దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీలో వెలుగులోకి వస్తున్న అక్రమాలతో అక్రమార్కుల్లో వణుకుపుడుతోంది. దళారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈ రెండు పథకాల్లో అనర్హులకూ లబ్ధి చేకూర్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది.  


 క్షుణ్ణంగా విచారణ..!
 జిల్లాలో కల్యాణలక్ష్మీ పథకం కింద 3,800 దరఖాస్తులు రాగా..  కేవలం మంచిర్యాల పరిధిలోని నస్పూర్, తీగల్‌పహాడ్, క్యాతన్‌పల్లి ప్రాంతాల నుంచే సుమారు 1500, మంచిర్యాల పట్టణం నుంచి కేవలం నాలుగు దరఖాస్తులున్నాయి. ఇందులో విశేషమేమిటంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రాంతాలన్నీ సింగరేణి కార్మికులవే కావడం. ఇటు షాదీ ముబారక్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 2,800 దరఖాస్తులొచ్చాయి. వీటిలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి.

 

ఏళ్ల క్రితం పెళ్లయిన జంటలూ ఈ పథకం కింద లబ్ధిపొందారు. ఈ రెండూ పథకాల్లో లబ్ధిపొందిన సగానికి పైగా దరఖాస్తులపై ఏసీబీ అధికారులకు అనుమానాలున్నాయి. ఇప్పటికే షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథక దరఖాస్తులు, లబ్దిదారుల జాబితాను డివిజన్, నియోజకవర్గం, మండలాల వారీగా సేకరించిన ఏసీబీ అధికారులు సమగ్ర విచారణలో నిమగ్నమయ్యారు. లబ్ధిదారుడు సంబంధిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా..? కాదా..? కుటుంబ ఆర్థిక పరిస్థితి..? వివాహం జరిగిన తేదీ ? సంబంధిత ధ్రువీకరణ పత్రాలపై విచారణ చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ పథకంలో లబ్ధిపొందాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. అయినా ఎంతోమంది ఆదాయానికి మించి ఆస్తులున్నా పథకం ద్వారా లబ్ధిపొందారు.


 అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు:  పాపాలాల్, ఏసీబీ డీఎస్పీ
 నిరుపేద యువతీ, యువకుల వివాహాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా అనర్హులూ లబ్ధిపొందినట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులకు లబ్ధి చేకూర్చారు. కొందరు ప్రజాప్రతినిధులు, దళారులు ప్రభుత్వాన్ని మోసం చేసి పేదలకందాల్సిన నిధులు కాజేశారు. అలాంటి వారి భరతం పడతాం. రెండు పథకాల లబ్ధిదారుల జాబితాను తీసుకున్నాం. మేమే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేపడతాం. అనర్హులు పథకాల ద్వారా లబ్ధిపొందినట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం.

 

మరిన్ని వార్తలు