అప్పు పుట్టేనా..

14 Feb, 2017 22:46 IST|Sakshi
అప్పు పుట్టేనా..

సాక్షి, విజయవాడ : అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) ప్రాజెక్టును ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవేసేందుకుఅధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రాజెక్టు ఊపందుకోవాలంటే నిధులు అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరకొరగానే నిధులు విడుదల చేస్తుండటంతో ఆర్థిక సంస్థల నుంచి అప్పు కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన రెండు ఆర్థిక సంస్థల ప్రతినిధులను విజయవాడ రప్పించి నిధులపై చర్చలు జరుపుతున్నారు.

నగరంలో కెఎఫ్‌డబ్ల్యూ బృందం ...
జర్మనీకి చెందిన ఐదుగురు సభ్యులున్న  కెఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు బృందం సోమవారం విజయవాడ వచ్చింది. ఈ బృందంలో కెఎఫ్‌డబ్ల్యూ సౌత్‌ ఏసియా రీజియన్‌ హెడ్‌ డి.స్కామ్‌బ్రక్స్, రాబర్ట్‌ వాల్కోవిక్, పి.రోణి, జైలా సోల్చర్, ఉషారావులు ఉన్నారు. ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి వారికి మెట్రో రైలు ప్రాజెక్టు గురించి వివరించడంతోపాటు,  నిధుల ఆవశ్యకతపైనా చర్చించారు.తొలిరోజు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను చూపించారు. విజయవాడ ట్రాఫిక్, పెరుగుతున్న రద్దీ, కొత్త రాష్ట్రానికి రాజధాని నేపథ్యంలో ఇక్కడ మెట్రో రైలు ఆవశ్యకత గురించి వివరించారు. కాగా ఈ బృందం ఇంకా మూడు నాలుగు రోజులు నగరంలో ఉండి పుష్కర ఘాట్లు, అమరావతి మార్గం తదితర ప్రాంతాలను పరిశీలిస్తుందని సమాచారం.

నేడు ఫ్రాన్స్‌ బృందం రాక...
ఫ్రాన్స్‌కు చెందిన ఏఎఫ్‌డీ బృందం మంగళవారం నగరానికి రానుంది. ఇందులో ఏఎఫ్‌డీ ట్రాన్స్‌ డివిజన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ మాధ్యూవడ్యూర్, ఎస్‌.బెర్నాడ్‌ శ్రీనివాసన్, హర్వే దుబ్రిల్, రజనీష్‌ అహుజాలు ఉంటారని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ బృందం కూడా మూడు రోజులు నగరంలో ఉండి విజయవాడలో మెట్రో ప్రాజెక్టు అవసరాన్ని గురించి అధ్యయనం చేసి ఎంతమేరకు నిధులు ఇస్తారనే అంశాన్ని చర్చిస్తుందని తెలిసింది.

ఎక్కడ అప్పు పుడితే అక్కడ..
నిధులు కోసం ఎదురు చూస్తున్న ఏఎంఆర్‌సీ, ఏ సంస్థ ముందుకు వస్తే ఆ సంస్థ ఆసరా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాజెక్టుకు సుమారు రూ.3,600 కోట్లు వరకు అవసరం అవుతాయి. అయితే ఈ ప్రాజెక్టు ఎంత మేరకు విజయవంతం అవుతుందోనన్న అనుమానంతో విదేశీ కంపెనీలు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల వద్ద రుణం తీసు కోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కెఎఫ్‌డబ్ల్యూ, ఏఎఫ్‌డీ బృందాలతో అధికారులు విడివిడిగా, ఆ తరువాత కలిపి చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ రెండు కంపెనీలు కలిసి మెట్రో ప్రాజెక్టుకు మొత్తం నిధులు ఇస్తే తీసుకోవాలనే ఆలోచనలో ఏఎంఆర్‌సీ అధికారులు
 ఉన్నారు.

మరిన్ని వార్తలు