పర్యావరణానికి హాని కలిగిస్తే జరిమానా

21 Dec, 2016 23:17 IST|Sakshi
పర్యావరణానికి హాని కలిగిస్తే జరిమానా
- ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ రాజేంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వ్యర్థాలను ఉత్పత్తి చేసి పర్యావరణానికి హాని కలిగిస్తే యూజర్‌ ఫీ పేరుతో భారీ ఎత్తున జరిమానా విధించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు జోనల్‌ ఆఫీసర్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సవరించిన వ్యర్థాల నిర్వహణపై బుధవారం సస్యప్రైడ్‌ హోటల్‌లో రాయలసీమ జిల్లాలోని మునిసిపాలిటీలు, పరిశ్రమల యజమానులకు రెండు రోజుల శిక్షణ తరగతులను కర్నూలు మునిసిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబుతో కలసి ఆయన  ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కొత్త నియమాలు పురపాలక, నగర, పట్టణ, పారిశ్రామిక వాడలకే కాక ప్రత్యేక ఆర్థిక మండళ్లకు వర్తిస్తాయన్నారు. చెత్తను బయట పడవేస్తే రూ.10 వేలను జరిమానా విధించే అధికారాన్ని జాతీయ హరిత ధర్మాసనం(ఎన్‌జీటీ) స్థానిక సంస్థలకు అప్పగించినట్లు తెలిపారు. క్యారీ బ్యాగుల మందాన్ని 40 మైక్రాన్ల నుంచి 50 మైక్రాన్లకు పెంచినట్లు తెలిపారు. నగర, పట్టణ, గ్రామస్థాయి వరకు ఇవే నియమాలు అమల్లో ఉంటాయన్నారు.
 
          జీవ–వైద్య వ్యర్థాలను సమర్థంగా నియంత్రించడానికి బార్‌ కోడ్‌ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు మాట్లాడుతూ..వ్యర్థాల నిర్వహణ విధానంపై మునిసిపల్‌ కార్మికులకు కూడా  అవగాహన లేదన్నారు. పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థ ప్రత్యేకంగా పరిగణించే చట్టాలను తేవాలన్నారు. ప్రస్తుతం రోడ్లను శుభ్రం చేసే కార్మికులు, కాలువలను శుభ్రం చేసే వారు ఇలా వేర్వేరుగా ఉన్నారని, దీనివల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఒక కార్మికుడు ఓ ప్రాంతాన్ని కేటాయించి రోడ్లను ఊడ్చడం, కాలువలను ఎత్తివేయడం, ఇలా రకాల వ్యర్థాల నిర్వహణను చూసుకునే బాధ్యతను అతనికే అప్పగించాలన్నారు. మరోవైపు వ్యర్థాల నిర్వహణపై పరిశోధనలు జరగాలని సూచించారు. కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఉదయ్‌ భాస్కరరెడ్డి, రాంకీ గ్రూపు అధికారి తోట కృష్ణారావు, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్లు శివరామిరెడ్డి, కృష్ణ, ప్రసాదరావు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు