మరణంలో వీడని బంధం..

4 Nov, 2015 02:42 IST|Sakshi
మరణంలో వీడని బంధం..

తల్లి, కుమారుడు సజీవదహనం
మైలార్‌దేవ్‌పల్లిలోని కాటన్ ఫైబర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైన తల్లి.. నాలుగేళ్ల కుమారుడు
అనుమతులు లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్న షిరాజుద్దీన్ అనే వ్యక్తి
పరిశ్రమ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
 
హైదరాబాద్: పొట్టకూటి కోసం పనిలోకెళితే ఆ తల్లీకొడుకులను మృత్యువు కబళించింది. నాలుగేళ్ల కుమారుడిని రక్షించుకునేందుకు కడదాకా పోరాడిన ఆ తల్లి చివరికి కొడుకుతో పాటు అగ్నికీలలకు ఆహుతైపోయింది. మంగళవారం మధ్యాహ్నం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్‌లోని ఓ కాటన్ ఫైబర్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఘోర అగ్నిప్రమాదం సంభవించడంతో తల్లి, కుమారుడు సజీవదహనమయ్యారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, సీఐ వెంకట్‌రెడ్డిల కథనం మేరకు.. పాతబస్తీకి చెందిన షిరాజుద్దీన్ అనే ఓ వ్యక్తి మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి నగర్‌లో కాటన్ ఫైబర్ రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. ఈ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవు. అందులో 10 మంది కార్మికులు పని చేస్తున్నారు. బండ్లగూడ జాంగీరాబాద్‌కు చెందిన షేక్ హైమద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి భార్య షకిరా బేగం, నాలుగేళ్ల కుమారుడు అబ్బాస్ ఉన్నారు.
 
 కుటుంబ పోషణ భారం కావడంతో షకిరా బేగం.. షిరాజుద్దీన్ పరిశ్రమలో మూడు నెలల క్రితం దినసరి కూలీగా పనిలో చేరింది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తోటి కార్మికులంతా భోజనం చేసేందుకు బయటకు వెళ్లగా.. షకిరా బేగం తన కుమారుడితో పరిశ్రమలోనే ఉంది. అయితే ఇదే సమయంలో ప్రమాదవశాత్తు కంపెనీలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పరిశ్రమ లోపలే అబ్బాస్ ఆడుకుంటూ ఉండటంతో కుమారుడిని రక్షించుకునేందుకు షకిరా బేగం ప్రయత్నించింది. మంటలు వేగంగా వ్యాపించి చుట్టుముట్టడంతో వారిద్దరూ అగ్నికి ఆహుతైపోయారు. అగ్నిప్రమాదంపై స్థానికులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే షకిరా బేగం, అబ్బాస్ మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారాయి.
 
మరణంలో వీడని బంధం..
షకిరా బేగం అతని కుమారుడు అబ్బాస్‌ల బంధం మరణంలోను వీడలేదు. మంటలను లెక్క చేయకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి కుమారుడిని రక్షించే క్రమంలో తల్లీకుమారుడు మృత్యువాత పడ్డారు. పరిశ్రమలో మంటలు చెలరేగే సమయంలో అబ్బాస్ మిషన్ వద్ద ఆడుకుంటున్నాడని, గేటు వద్ద ఉన్న షకిరా బేగం కుమారుడిని రక్షించేందుకు పరిశ్రమ లోపలికి పరుగు తీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరణంలోనూ వీడని తల్లీకొడుకుల బంధం స్థానికులను కంటతడి పెట్టించింది.
 
బాధ్యులపై కఠిన చర్యలు: ఏసీపీ
నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమను నెలకొల్పడమే కాక.. నిండు ప్రాణాలు బలికావడానికి కారకుడైన షిరాజుద్దీన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ నిర్వహణకు అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా చిన్నారిని పరిశ్రమలోనికి అనుమతించినందుకు నిర్వాహకునిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. పరిశ్రమ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, మృతుల కుటుంబానికి న్యాయం చేసేందుకు తమ వంతు సాయం చేస్తామని గంగారెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు