గొల్లుమన్న పొనుగుటివలస

29 Nov, 2016 03:54 IST|Sakshi
రాజాం :రాజాం నగర పంచాయతీ పరిధి పొనుగుటివలస గ్రామంలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో 13 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో సుమారు పది లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. గ్రామస్తులంతా వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లో ఉన్న సమయంలో ప్రమాదం సంభవించడం, విషయం తెలిసి పరుగున వచ్చేసరికే ఇళ్లన్నీ కాలిపోవడంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. వీరంతా నిరుపేదలు కావడం, ఇళ్లు, తిండిగింజలు కాలిపోవడంతో వారంతా వీధినపడ్డారు. మంటలను అదుపు చేసే క్రమంలో మాసాబత్తుల అప్పారావు ఇంటిలోని గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకువచ్చారు. ఇంతలో అది పేలడంతో ఆ ధాటికి పక్కనే ఉన్న గేదె దూడ మృతి చెందింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.  
 
 బాధితులు వీరే
 ప్రమాదంలో వడ్డి తవుడు, మాసాబత్తుల అప్పారావు, కొత్తకోట సత్యనారాయణ, పెంటిమాని పండోడు, కురిమిళ్ల రాము, శాసపు నారాయణరావు, సుంకరి సూరీడమ్మ, ఎం.సూరిబాబు, కళ్లూరి లక్ష్మి,  సత్యం, పట్నాన అప్పలరాజు, బడిమింటి తిరుపతిరావు, దనుకోటి అన్నపూర్ణ తదితరులకు చెందిన ఇళ్లు కాలిపోయాయి. రేషన్, ఆధార్ కార్డులు, ఎల్‌ఐసీ బాండ్లు, విద్యుత్‌మీటర్లు కాలిపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ షార్ట్ సయిక్యట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఎమ్మెల్యే పరామర్శ
  ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే రాజాం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు పొనుగటివలస వెళ్లి బాధితులను పరామర్శించారు. సంతకవిటి తహసీల్దార్ జి.సత్యనారాయణతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని, పక్కా గృహాలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మినరసింహం, రెడ్‌క్రాస్ చైర్మన్లతో ఫోన్‌లో సంప్రదించి బాధితులకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రమాద సమయంలో శాసపు వేణునాయుడు, శాసపు కేశవనాయుడు తదితరులు అందించిన సేవలపై వారిని అభినందించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు వంజరాపు విజయ్‌కుమార్, రెడ్డి అప్పలనాయుడు, సంతకవిటి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనేత వావిలపల్లి రమణారావు, దన్నాన భవానీశ్రీ ఉన్నారు.
 
 వైఎస్‌ఆర్ సీపీనేత భోజనాల ఏర్పాటు
  అగ్నిప్రమాద బాధితులకు గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్ సీపీ నేత శాసపు వేణునాయుడు సోమవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. మరో రెండు రోజులపాటు కూడా భోజనాలు ఏర్పాటు చేయనున్నట్టు వేణునాయుడు ‘సాక్షి’కి తెలిపారు.  
మరిన్ని వార్తలు