ఈ డీలరు మాకొద్దు...

1 Oct, 2016 23:36 IST|Sakshi
పోతురాజుపేట రేషన్‌ డిపో వద్ద వివాదం జరుగుతున్న దశ్యం
పోతురాజుపేట (సంతకవిటి) : మండాకురిటి పంచాయతీ పోతురాజుపేట గ్రామంలో రేషన్‌ డిపో డీలరు విషయమై శనివారం వివాదం నెలకొంది. గ్రామంలో కిరాణ షాపు వద్ద రేషన్‌ సరుకులను డీలరు విక్రయిస్తుండగా గ్రామానికి చెందిన కొందరు కార్డు లబ్ధిదారులు అడ్డుతగిలారు. కార్డు లేని వ్యక్తికి రేషన్‌ డిపో బాధ్యతలు అప్పగించి డిపో నడమేంటని నిలదీశారు. ఈ క్రమంలో సరుకులు విక్రయించిన వ్యక్తికి, గ్రామస్తులకు వివాదం రేగింది. ఈ విషయంలో గ్రామస్తులంతా ఒక్కటవ్వడంతో రేషన్‌ సరుకులు విక్రయించిన వ్యక్తి మిన్నకుండిపోయాడు.
 
విషయం తెలుసుకున్న సంతకవిటి రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకుని రేషన్‌ సరుకుల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపి వేయించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో తొలగించిన రేషన్‌ డీలరు స్థానంలో కొత్తగా అంబళ్ల ఈశ్వరమ్మ అనే మహిళను నియమించారని, ఈమెకు గ్రామంలో రేషన్‌ కార్డు కూడా లేదని ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. రేషన్‌ సరుకులను కిరాణ షాపు వద్ద విక్రయించడం అనుమానాలకు తావిస్తుందన్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఇలా దొడ్డిదారి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. 
 
 
మరిన్ని వార్తలు