తొలికాంతి.. సంక్రాంతి

13 Jan, 2017 22:41 IST|Sakshi
తొలికాంతి.. సంక్రాంతి

ఆరుబయట చలిమంటలు.. వాకిళ్లలో ముగ్గులు.. వాటిపై గొబ్బెమ్మలతో ఆడపిల్లల ఆనందం.. ఆకాశంలో పతంగులతో అబ్బాయిల ఉత్సాహం.. గంగిరెద్దుల ఆటలను చూసి పిల్లల కేకలు.. ఈ సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. మరోవైపు వంటింట్లోంచి నోరూరించే వంటల ఘుమఘుమలు.. బోగిపండ్లు.. బొమ్మలు కొలువులు! మొత్తంగా ఇవి సంక్రాంతి తెచ్చే ఆనందాల కాంతులు.

నెల్లూరు(సెంట్రల్‌): తెలుగు వారి పెద్దపండుగైన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త అల్లుళ్ల రాకలు, బంధువుల సందడితో వాతావరణం పేరుకు తగ్గట్లే పెద్ద గానే ఉంటుంది.పల్లెల్లో అయితే చెప్పనక్కర్లే దు. పండుగకు వారం రోజుల ముందే పిండివంటల తయారీ మొదలెట్టి పూర్తిచేశారు. పట్టణాల బాట పట్టినవారు సైతం సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చేస్తున్నారు. గంగిరెద్దులవారు, బుడబుడకల సందడి..యువత ఆటలు, కేరింతల సవ్వడి.. పల్లె, పట్నం తేడా లేకుండా కనిపిస్తోంది.

అపార్ట్‌మెంట్‌ వాసులందరూ కలిసి కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇక నెల్లూరు పట్టణంలోని పెన్నా నదిలో గత కొన్ని సంవత్సరాలుగా ఏటి పండుగను నిర్వహిస్తున్నారు. గాలి పటాల పండుగను కూడా చేసుకుంటారు. సంక్రాంతి రోజు జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల లోని దేవతామూర్తుల విగ్రహాలను పెన్నా నది ఒడ్డుకు  తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడకు వచ్చిన వారికి తీర్థప్రసాదాలు అందచేస్తారు. ఈ వేడుకను చూడటానికి నగరం చట్టుపక్కల వారు కూడా వస్తుంటారు. ఇక పోతే సూళ్ళూరుపేట, నాయుడుపేటలలో మాత్రం కాళంగి నది, స్వర్ణముఖి నదిలో ఏటి పండుగను ప్రజలు జరుపుకుంటారు. కోవూరులో గత 25 సంవత్సరాలుగా వస్తున్న ఎడ్ల పందాలు ప్రత్యేకం. మన జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా నుంచి కూడా ఈ పందేలు చూడటానికి వస్తుంటారు. అందుకే తెలుగు లోగిళ్లకు తొలికాంతి అయిన సంబరాల సంక్రాంతిని అందరూ ఆనందంగా జరుపుకుంటారు.

సంక్రాంతి అంటే..
సంక్రాంతి అంటే పురాణాల సాక్షిగా సంక్రమణం. అంటే మార్పు చెందడం. సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. ఎందుచేతనంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశిస్తాడు. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. అందుకే ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతు లతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు రోజులు చేసుకోవడం ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు.

భోగిభాగ్యాలు
మూడు రోజుల పండగలో మొదటిగా భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. ఈరోజు అందరూ భోగి మంటలతో ఉల్లాసంగా గడుపుతారు. అందరూ ఉదయాన్నే లేచి ఎముకలు కొరికే చలిని తరిమేయడానికి పాతవస్తువులు అన్నీ సమకూర్చి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా వాటిని భోగి మంటల్లో మంట పెడుతూ చల్లని ఆ చలిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ఇక సాయంత్రం వేళ, బొమ్మల కొలువులతో, చాలా ఇళ్ళలో చిన్నపిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శిస్తూ ఆనందంగా, ఉల్లాసంగా అడుతూపాడుతూ గడుపుతారు. ఇక భోగిపళ్ళ పేరంటాలైతే అందరూ సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణేలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు.

సంప్రదాయానికి ప్రతీక
మకర సంక్రాంతి రెండవ రోజు. ఈరోజు తెల్లవారగానే పాలు పొంగించి, కొత్త బట్టలు వేసుకుని, రుచికరమైన పిండి వంటలు తింటూ, సంతోషంగా గడుపుతూ ఈ పండుగను ఆస్వాదిస్తారు, మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.

అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన, అలరించే విషయం ఏమిటంటే ఈ రోజున ‘హరిలో రంగ హరీ’ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు తొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగ వల్లులతో ఇంటి ముంగిళ్ళు కళకళలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.

అన్నదాతకు కొత్తకళ  
సంక్రాంతి పండుగ మూడవ రోజు చివరిదైన కనుమ రోజు. ఇళ్ళన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ, అందరికి ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు, ఈరోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆడ పిల్లలందరు గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అంటే గోపిబొమ్మ. అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం. వీటి చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు.

మరిన్ని వార్తలు