ఫ్యాక‌్షన్‌ నిర్మూలన మొదటి ప్రాధాన్యత

6 Jul, 2017 00:29 IST|Sakshi
ఫ్యాక‌్షన్‌ నిర్మూలన మొదటి ప్రాధాన్యత
- కర్నూలు రేంజ్‌ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఘట్టమనేని శ్రీనివాస్
కర్నూలు :  ఫ్యాక్షన్‌ నిర్మూలనే నా మొదటి ప్రాధాన్యత... ఎర్ర చందనం స్మగ్లింగ్, మట్కాపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కర్నూలు రేంజ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ అన్నారు. కర్నూలు బి.క్యాంప్‌లోని కార్యాలయంలో బుధవారం ఆయన డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కర్నూలు సిల్వర్‌జుబ్లీ కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నాని, జిల్లాపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. పాలనాపరమైన విషయాల్లో ఎస్పీలకు అండగా ఉంటానన్నారు. అనంతరం ఎస్పీ గోపీనాథ్‌ జట్టి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్‌ ఎస్పీలు షేక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు, ఇతర అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. 
 
ఘట్టమనేని ఉద్యోగ ప్రస్థానం... 
ఘట్టమనేని శ్రీనివాస్‌ స్వస్థలం అనంతపురం జిల్లా గుంతకల్లు. 1986లో కర్నూలు జిల్లా లొద్దిపల్లెలో పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌గా పనిచేశారు. 1990లో ఏపీపీఎస్‌సీ గ్రూప్‌1 పరీక్షలో మంచి ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. దీంతో కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో డీఎస్పీగా నియమితులయ్యారు. అనంతరం ప్రొద్దుటూరు, కడప డీఎస్పీగా, హైదరబాదులో ఏసీపీగా, అడిషనల్‌ డీసీపీగా, మెదక్‌లో అడిషనల్‌ ఎస్పీగా విధులు నిర్వహించారు. శాంతిభద్రతలు, ఆపరేషన్‌లలో భాగంగా ఆఫ్రికా, యూఎస్‌ఏ, స్వీడన్‌ దేశాలకు వెళ్లారు.    తూర్పుగోదావరి, విశాఖపట్నం రూరల్, టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తూ పదోన్నతిపై డీఐజీగా కర్నూలుకు వచ్చారు. 
 
మరిన్ని వార్తలు