తొలి జీతం సారు వారికే...

13 Dec, 2015 03:34 IST|Sakshi
తొలి జీతం సారు వారికే...

గీతం వొద్దు జీతమే ముద్దు!
తన శాఖలో కొత్తగా ఉద్యోగంలోకి చేరేవారు తొలినెల జీతం ఆ మంత్రిగారికి సమర్పించుకోవాలట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసరమైన ఒకటి, రెండు శాఖల్లో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన పదుల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ భర్తీల్లో ఉద్యోగాలు పొందిన వారు కొందరు సంతోషంగా ఉంటే... మరికొందరు మాత్రం వేదనను అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఒక శాఖలో సుమారు 50 మందిని శాశ్వతప్రాతిపదికన ఉద్యోగాల్లో నియమించారు. వీరికి హైదరాబాద్‌లో శిక్షణనిచ్చారు. ఆ తరువాత పోస్టింగ్‌లు ఇచ్చారు. పోస్టింగ్‌లు ఇచ్చే సమయంలో వారికి ఆ శాఖ ఉన్నతాధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో వారు వేదనను అనుభవిస్తున్నారు.

మన మంత్రి గారు మీకు ఉద్యోగాలు వచ్చేందుకు చాలా కష్టపడ్డారు. సీఎంతో కొట్లాడి మన శాఖలో పోస్టులు భర్తీ చేసేందుకు ఆయన్ను అంగీకరింపచేసేందుకు మన మంత్రిగారి తలప్రాణం తోకకు వచ్చింది. ఆయన పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు జీవితాంతం అనుభవించబోతున్నారు. ఆయన కష్టాన్ని గుర్తించి మీరు తగిన విధంగా సత్కరించాలని చెప్పారు. దీంతో ఆ ఉద్యోగాలకు ఎంపికైన వారందరూ తలా వెయ్యో, రెండువేలు చందా రూపంలో వేసుకుని తమ శిక్షణాకాలం పూర్తయ్యే రోజున ఘనంగా సత్కరిద్దామనుకున్నారు. ఇదే విషయాన్ని వారు తమ ఉన్నతాధికారులకు విన్నవించారు.

వారు మంత్రిగారి చెవిలో వేశారు.  దీంతో మంత్రిగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. నేను ఇంత కష్టపడింది పూలబొకేలు, శాలువాల కోసమా అని అగ్గిమీద గుగ్గిలం అయ్యారట. కొత్తగా ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరూ వారి తొలి నెల జీతాన్ని నాకు సమర్పించుకోవాల్సిందే అని హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ శాఖ ఉన్నతాధికారులు ఎంపికై శిక్షణలో ఉన్న అభ్యర్ధులకు  మంత్రిగారి ఆదేశాన్ని చేరవేశారు. దీంతో ఆ అభ్యర్ధులు మంత్రిగారా మజాకా అని మనస్సులో అనుకుని ఒకనెల జీతాన్ని సమర్పించుకుని బయటపడ్డారు.

మరిన్ని వార్తలు