సాపాటుకు లంగరు

13 Dec, 2016 23:33 IST|Sakshi
సాపాటుకు లంగరు
  • వేట లేక పూటగడవని వైనం
  • మత్స్యకారుల జీవనోపాధికి గండి
  • రూ.5 కోట్ల మేర నిలిచిన చేపల వ్యాపారం
  • చతికిలబడ్డ చిరువ్యాపారాలు
  •  
    వర్దా తుపాను మత్స్యకారుల జీవనోపాధికి లంగరేసింది. సముద్రంలో చేపల వేట నిషేధించడంతో పూటగడం కష్టమవుతోంది. కోట్లలో వ్యాపారాలు నిలిచిపోవడంతో చిరు వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 
    – పిఠాపురం
    తూర్పుగోదావరి జిల్లాలోని తుని నుంచి అంతర్వేది వరకు సుమారు 144 కిలో మీటర్ల మేరా ఉన్న తీర ప్రాంతంలో 13 మండలాలు విస్తరించి ఉండ గా 99 తీరప్రాంత గ్రామాలు ఉన్నాయి. వీటిలో సుమారు 1.85 లక్షల మంది మత్స్యకారులు ఉండగా సంప్రదాయ చేపల వేట ద్వారా సుమారు 85 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. 485 మెకనైజ్డ్‌ బోట్లు, 1,332 ఫైబర్‌ బోట్లు, 3,800కు పైగా సంప్రదాయ పడవలు అధికార లెక్కల ప్రకారంగా ఉండగా, అనధికారికంగా మరో వెయ్యికిపైగా బోట్లు, తెప్పలపై మత్స్యకారులు వేట సాగిస్తుంటారు. ప్రతినిత్యం కాకినాడ హార్బర్‌తో పాటు జిల్లాలోని వివిధ తీర ప్రాంతాల నుంచి సుమారు 250 టన్నులకుపైగా చేపలు, 300 టన్నులకు పైగా రొయ్యలు, మరో 200 టన్నులకు పైగా ఇతర సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. దీని ద్వారా సుమారు రూ.50 లక్షల వరకు ఆదాయాన్ని అర్జిస్తుంటారు. అయితే నాలుగు రోజులుగా వేట నిలిచిపోవడంతో సుమారు రూ. రెండు కోట్ల ఆదాయానికి గండి పడింది. అలాగే మత్స్య సంపద ద్వారా జిల్లాలో రోజూకు సుమారు రూ.1.25 కోట్ల మేరా ఆదాయం వస్తుండగా నాలుగు రోజులుగా రూ.5 కోట్ల ఆదాయం కోల్పోయింది. అలాగే మత్స్య సంపద ఎగుమతుల కోసం ఉపయోగించే ఐస్‌ తదితర వ్యాపారాలు సుమారు రూ.50 లక్షల వరకు దెబ్బతిన్నాయి డీజిల్, రవాణా వ్యవస్థల పైనా తుపాను ప్రభావం పడింది. 
    చిరు వ్యాపారాలు చేసే మత్స్యకార మహిళలు సైతం జీవనోపాధి కోల్పోయారు. మరోపక్క సముద్ర కెరటాలు ముంచెత్తడం వల్ల సుమారు రూ.30 లక్షల విలువైన ఎండు చేపలు తడిసి తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చినట్లు మత్స్యకారులు వాపోతున్నారు. వేట లేక పూటగడవని పరిస్థితుల్లో పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
    అంచనా వేస్తున్నాం
    తుపాను వల్ల నాలుగు రోజులుగా చేపల వేట నిలిచి పోయింది. మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యలతో సముద్రంలో ఉన్న మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగలిగాము. 
    – అంజలి, మత్స్యశాఖ డీడీ, కాకినాడ
    బోట్లు దెబ్బతిన్నాయి
    తుపాను తాకిడికి జట్టీలు లేక ఉప్పుటేరులో లంగరు వేసిన బోట్లు దెబ్బతిన్నాయి. వాటికి నష్టపరిహారం అందించాలి. శాశ్వత ప్రాతిపదికన ప్రతి మత్స్యకార కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఆర్థిక సాయం అందించాలి.
    – బడే హల్లేలూయ, 
    మత్స్యకార నాయకుడు అమీనాబాద
     
     
     
మరిన్ని వార్తలు