వేటకు బ్రేక్‌

11 Apr, 2017 00:11 IST|Sakshi
  • ఈ నెల 15 నుంచి చేపల వేట నిషేధం
  • ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అంటున్న అధికారులు
  • 61 రోజులపాటు జీవనం ఎలా...?
  • ప్రత్యామ్నాయం చూపక పోతే ఇబ్బందులే : మత్స్యకారుల ఆవేదన
  • పిఠాపురం :  
    మత్స్యకారుల బతుకు వేటకు బ్రేక్‌ పడనుంది. ఈనెల 15 నుంచి జూ¯ŒS 14 వరకు 61 రోజులపాటు ప్రభుత్వం చేపల వేటను నిషేధించింది. ప్రతి ఏటా ఈ రెండు మాసాలు చేపల వేట నిషేధిస్తున్నప్పటికీ జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించకపోతే కష్టమేనని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 13  మండలాల్లో తీర ప్రాంతం విస్తరించి ఉండగా 99 గ్రామాలు సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. వీటిలో 3,55,392 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరిలో చేపల వేట ద్వారా జీవనోపాధి పొందేవారు 66,777 మంది ఉన్నారు. వీరు 5,397  బోట్లపై వేట సాగిస్తుండగా వాటిలో తెప్పలు, నావలు 3,490 ఉండగా, మెకనైజ్డ్‌ బోట్లు 415 ఉన్నాయి. మోటారు బోట్లు 486 ఉన్నాయి.
     
    మత్స్య క్రమబద్ధీకరణ చట్టం
    చేపలు పునరుత్పత్తి (గుడ్లు పొదిగి పిల్లలు తయారయ్యే సమయం) జరిపే సమయంలో చేపల వేట సాగిస్తే మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతుందని, ఆ సమయంలో చేపల వేట నిషేధం ద్వారా మత్స్య సంపద పెంపునకు అవకాశం ఉంటుందని నిపుణుల సూచనల ప్రకారం ఈ చట్టం రూపొందించారు. ఈ చట్ట ప్రకారం నిషేధ సమయంలో ఎవరైనా చేపల వేట సాగిస్తే వారికి రూ.2,500 వరకు జరిమానా  విధించడంతోపాటు బోట్లను సీజ్‌ చేస్తారు. వేటాడిన మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటారు. కన్యాకుమారి నుంచి కోల్‌కతా వరకు ఈ నిషేధం అమలులో ఉంటుండగా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోడానికి మత్స్యశాఖతోపాటు పోలీస్, మెరైన్, నావీ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి గస్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సంప్రదాయ పద్ధతిలో ఇంజిన్లు లేకుండా వేట సాగించే మత్స్యకారులకు మాత్రం ఈ నిషేధం వర్తించదని మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు.  
    ప్రత్యామ్నాయం సంగతేంటి...?
    ప్రతి ఏటా వేట నిషేధం క్రమంతప్పకుండా అమలు చేస్తున్నారు. అయితే గతంలో 45 రోజులు మాత్రమే ఉండే వేట నిషేధం గత రెండేళ్లుగా 60 రోజులకు పెంచారు. ఈ 61 రోజులపాటు వేట ఆగి పోవడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిని పస్తులుండాల్సి వస్తుందని మత్స్యకారులు వాపోతున్నారు. పరిహారంగా బియ్యం పంపిణీ చేస్తున్నా అది సమయానికి అందజేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
     
    ప్రత్యామ్నాయం చూపించాలి...
    పాటు లేక పోతే మాకు పూట గడవదు ... వేట ఆపేయమంటారు మరి మేమెలా బతికేది. వేట వద్దనే పెద్దలు అధికారులు ఆ రెండు నెలలు మాకు బతుకుదెరువు చూపించాలి. ఏ పూటకు ఆ పూట వేటతో కడుపునింపుకునే మాకు ఏకంగా రెండు నెలలు పూటగడవకపోతే పస్తులుండడం తప్ప వేరే దారి లేదు. అందుకే ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలి. 
    – జి. హరిబాబు, మత్స్యకారుడు, కోనపాపపేట
    ముందుగానే పరిహారం ఇవ్వాలి
    వేట నిషేధం అమలైతే మాకు బతుకుదెరువు పోతుంది. ఆ రెండు నెలలు బతకడానికి పరిహారం ముందుగానే ఇవ్వాలి. లేకపోతే అప్పుల పాలవుతున్నాం.
    – ఎం.జగన్నాధం, మత్స్యకారుడు, కోనపాపపేట
     
    పట్టించుకునే వారు ఉండడం లేదు
    వేట నిషేధం అంటారు ... నీడలా వెంటాడతారు కానీ మా బాధలు మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఎప్పుడో వీలు కుదిరినప్పుడు రాజకీయ నాయకులు వచ్చి బియ్యం ఇచ్చి వెళ్లిపోతారు. ఈలోపు మాకు తిండిలేక ఉన్న వాటిని అమ్ముకుని బతకాల్సి వస్తోంది.
    – యు. సత్తిబాబు, మత్స్యకారుడు, కోనపాపపేట
     
>
మరిన్ని వార్తలు