మీనం.. ధర హీనం

25 Dec, 2016 21:56 IST|Sakshi
మీనం.. ధర హీనం
15 రోజుల్లో కేజీకి రూ.14 తగ్గుదల
 పెద్ద నోట్ల రద్దుతో మందగించిన ఎగుమతులు
 పట్టుబడులు నిలిపేసిన రైతులు
భీమవరం అర్బన్‌ : కొంతకాలంగా స్థిరంగా ఉన్న చేపల ధరపై పెద్ద నోట్లు రద్దు ప్రభావం పడింది. దీంతో రెండు వారాలుగా చేపల ధరలు పతనమవుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో కేజీకి రూ.14 మేర ధర పతనం కావడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. పట్టుబడుల వేళ ధర పతనంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చాలామంది రైతులు పట్టుబడులను నిలిపేశారు. అయితే ఎక్కువ కాలం ఆగే పరిస్థితి లేదని, మేత ఖర్చు పెరిగిపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తే అసలుకే మోసం వస్తుందని వారు వాపోతున్నారు. 
పెద్దనోట్ల రద్దుతో మందగించిన ఎగుమతులు
భీమవరం మండలంలోని వెంప, పెదగరువు, శ్రీరామపురం, గూట్లపాడు, ఈలంపూడి,  దెయ్యాలతిప్ప, రామాయణపురం, కొత్తపూసలమర్రు, కొమరాడ, ఎల్‌వీఎన్‌పురం, గొల్లవానితిప్ప, దొంగపిండి, లోసరి తదితర గ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో చేపలు, 4 వేల ఎకరాల్లో వనామీ రొయ్యలు సాగు చేస్తున్నారు. ఉప్పుటేరు, బొండాడ డ్రెయిన్, మందచేడు, కోటిమొగ డ్రెయిన్లను ఆనుకుని ఎక్కువగా శిలావతి, కట్ల, రూప్‌చంద్, ఫంగస్, గడ్డి చేప, జాడిమోస్‌ వంటి సప్పనీటి చేపలను పెంచుతున్నారు. భీమవరం కేంద్రంగా నిత్యం సుమారు 700 టన్నులు కోల్‌కతా, పాట్నా, తిరువిడి, ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. అయితే నెలన్నర క్రితం పెద్దనోట్లు రద్దు చేయడంతో క్రమేపీ ఎగుమతులు మందగిస్తూ వచ్చాయి. నగదు కష్టాల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. 15 రోజుల క్రితం శిలావతి కేజీ మార్కెట్లో రూ.104 ఉంటే ప్రస్తుతం రూ.90 పలుకుతోంది. రెండు కేజీల కట్ల చేప 103 నుంచి రూ.91కి, ఫంగస్‌ రూ.62 నుంచి రూ.56కి పడిపోయింది. రూప్‌చంద్‌ పదిరోజుల కిందట కేజీ రూ.90 ఉంఽడగా నేడు రూ.60 పలుకుతోంది.గడ్డిచేప రూ.70, జాడీమోస్‌ రూ.65 పలుకుతున్నాయి.
నిలిచిన పట్టుబడులు
చేప ధర ఒక్కసారిగా తగ్గడంతో పట్టుబడులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పట్టుబడికి వచ్చిన చేపలను మేపేందుకు భారీ పెట్టుబడులు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  శిలావతి, కట్ల, రూప్‌చంద్, ఫంగస్‌ చేపలకు పెట్టే మేతను బట్టి 7 నెలలు లోపు పట్టుబడికి రావాల్సి ఉంది. అయితే కొంతకాలంగా వాతావరణ పరిస్థితుల కారణంగా చేప ఎదుగుదల మందగించింది. దీంతో రైతులకు  ఖర్చు అధికమైంది.   
కుదేలైన కౌలు రైతులు
చేపల ధర పతనంతో కౌలు రైతులు కుదేలయ్యారు. చెరువును బట్టి ఒక్కో ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు కౌలు ఉంది. ఈ ఏడాది చేపల మేతల ధర విపరీతంగా పెరగడం, పట్టుబడి వేళ ధర పతనం కావడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు గగ్గోలు పెడుతున్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు