-

తొలిదశలో ఐదు జిల్లాలు!

7 Nov, 2015 03:09 IST|Sakshi
తొలిదశలో ఐదు జిల్లాలు!

మొదటగా మంచిర్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్
♦ ఒకేసారి 13 జిల్లాలు ఏర్పాటు చేస్తే వివాదాలు,  సమస్యలు వస్తాయనే భావన
♦ యంత్రాంగాన్ని సమకూర్చడం, సదుపాయాల కల్పన కూడా కష్టతరం
♦ వివాదం లేని వాటికే మొగ్గు చూపుతున్న ప్రభుత్వం
♦ తర్వాతి రెండేళ్లలో మరో ఎనిమిది కొత్త జిల్లాలు చేయాలనే యోచన
 
 (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం... మొదటి దశలో ఐదు జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న, వివాదాలు లేని వాటిని తొలుత జిల్లాలుగా ప్రకటించేందుకు ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, మెదక్ జిల్లాలోని సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్లు అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. ఒకేసారి 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే యంత్రాంగాన్ని సమకూర్చడం, మౌలిక సదుపాయాల కల్పన కష్టమవుతుందని భావించి.. తొలుత ఐదు జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపాయి. వచ్చే రెండేళ్లలో మరో 8 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.
 
   సిద్దిపేటకు చేర్యాల, హుస్నాబాద్..
 మెదక్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న సిద్దిపేట జిల్లాలోకి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్, వరంగల్ జిల్లాలోని జనగామ, నల్లగొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గాలను కలపాలన్న ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. చివరకు జనగామ, హుస్నాబాద్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలను కలపాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అప్పుడు మెదక్ జిల్లాలోని 3, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి ఒక్కో నియోజకవర్గం సిద్దిపేటలోకి వస్తుంది.
 
  సూర్యాపేటకు ఐదు నియోజకవర్గాలు
 నల్లగొండ జిల్లాలో ఉన్న సూర్యాపేటకు కొత్త జిల్లాగా మొదటి జాబితాలో చోటు దక్కడం దాదాపు ఖాయమైంది. ఇందులో సూర్యాపేటతో పాటు మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలు కలుస్తాయి. ఇక నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలను తదుపరి దశలో ఏర్పాటు చేయబోయే హైదరాబాద్ తూర్పు (ఎల్‌బీ నగర్) జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు ప్రస్తుతం ఉన్న నల్లగొండ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు మాత్రమే మిగులుతాయి.
 
  నాగర్‌కర్నూల్‌కు 4 నియోజకవర్గాలు
 మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌ను తొలి జాబితాలోనే జిల్లాగా ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో నాగర్‌కర్నూల్‌తో పాటు కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలు ఉంటాయి. తదుపరి దశలో మహబూబ్‌నగర్ జిల్లాలో మరో కొత్త జిల్లాగా వనపర్తిని ప్రకటించడం దాదాపు ఖాయమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
 
  ఎట్టకేలకు వికారాబాద్‌కు మోక్షం
 మూడు దశాబ్దాలుగా డిమాండ్ ఉన్న వికారాబాద్ జిల్లాకు తొలిదశలోనే మోక్షం కలుగనుంది. వికారాబాద్, చేవేళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాలను కలిపి ఈ జిల్లా ఏర్పాటు చేస్తారు. మిగతా నియోజవర్గాలు తదుపరి దశలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యేదాకా రంగారెడ్డి జిల్లాలో కొసాగుతాయి.
 
  మంచిర్యాలకు రామగుండం
 కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మంచిర్యాలలో కలుపుతారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న మంచిర్యాలను జిల్లాగా చేయాలని కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం ఆదిలాబాద్‌లో ఉన్న ఆసిఫాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్-కాగజ్‌నగర్, చెన్నూరు నియోజకవర్గాలను కలుపుతారు.
 
 కుప్పలు తెప్పలుగా వినతులు
  కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ వచ్చిన వినతులను ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల పరిశీలించింది. ఒక్క మహబూబ్‌నగర్ నుంచే నాలుగు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ శాసనసభ్యుల నుంచే వినతులు రావడం చూసి కమిటీ విస్తుపోయింది. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి కనిష్టంగా 2, గరిష్టంగా 4 జిల్లాల ఏర్పాటు కోసం వినతులు వచ్చాయి. కొన్ని చోట్ల జిల్లా డిమాండ్ సాధన సమితులు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి.

‘‘కొత్త జిల్లాల ఏర్పాటు ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఓ రకంగా తేనెతుట్టెను కదిపామా అన్న భావన కలుగుతోంది. ప్రాంతీయ విభేదాలు వస్తాయేమో అన్న ఆందోళన కూడా లేకపోలేదు. అందువల్లే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం..’’ అని సీనియర్ మంత్రి ఒకరు పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కొందరు మంత్రులు సీఎం కేసీఆర్‌కు సూచించారని.. దానితో మొదటికే మోసం వస్తుందని సీఎం భావిస్తున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. సుదీర్ఘకాలంగా జిల్లా హోదా కోసం ఎదురుచూస్తున్న వాటికే తొలిదశలో ప్రాధాన్యమివ్వనున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు