కృష్ణమ్మ తీరంలో కన్నీటి ధార

16 Aug, 2016 23:44 IST|Sakshi
కృష్ణమ్మ తీరంలో కన్నీటి ధార
* కృష్ణా జిల్లా నందిగామ వద్ద కృష్ణలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు
* అందరూ జలసమాధి
తల్లిదండ్రులకు తీరని శోకం
 
కృష్ణమ్మా.. పంట చేలకు ప్రాణం పోస్తున్నావనీ.. 
పచ్చని పసిరికల దాహం తీరుస్తున్నావనీ..
దేవాధిదేవులను అభిషేకిస్తున్నావనీ..
కవులకు కవన రీతులు నేర్పుతున్నావనీ..
కళాకారుల్లో నవ చైతన్యం రగిలిస్తున్నావనీ..
నిన్ను కల్పవల్లిగా కొలుస్తున్నారే..!
కొంగు బంగారంగా నిన్ను కీర్తిస్తున్నారే..
మేమూ నిన్ను పూజించాం.. నిన్ను కొలిచాం..
మా ఇంటి దీపాలను నీలో ఐక్యం చేసుకున్నావు..
కన్నపేగునూ తెచ్చివ్వూ...!  
 
నందిగామ రూరల్‌/చందర్లపాడు: మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణా నదిలో జరిగిన ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో విషాదం నింపింది. చేతికంది వచ్చిన కుమారులను కోల్పోయి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతులంతా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే... రేపో మాపో తమ బిడ్డలు ఉద్యోగం చేస్తారు... తమను జీవితాంతం సంతోషంగా చూసుకుంటారని ఆశించిన తల్లిదండ్రుల ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. కళాశాల నుంచి సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు బిడ్డల చావు కబురు అందడంతో వారంతా ఒక్కసారిగా హతాశులయ్యారు. ఒకే కళాశాలలో, ఒకే బెంచ్‌లో కూర్చునే నలుగురు మిత్రులు కలసే మృత్యు ఒడిలోకి చేరుకోవడం సహచర విద్యార్థులను కలచివేసింది. ఘటనాస్థలానికి పరుగు పరుగున వచ్చి మిత్రుల కోసం గాలించారు. ఇకలేరని తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పుడూ సంతోషంగా, సరదాగా ఉండే మిత్రులను చూసి మృత్యువుకు కూడా కన్ను కుట్టిందని, అందుకే 20 ఏళ్లు కూడా నిండక ముందే తనలో కలిపేసుకుందని తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. సబ్‌ కలెక్టరు సృజన, రెండు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. 
 
హరీష్‌.. లే.. తండ్రీ!
చందర్లపాడు మండలం, తోటరావులపాడు గ్రామానికి చెందిన ములకలపల్లి హరీష్‌ది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ముకుందరావు చిన్న తరహా రైతు, కుటుంబ పోషణ కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమూ చేస్తున్నారు. ముగ్గురు సంతానంలో హరీష్‌ చిన్నవాడు కావడంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. నందిగామలోని చైతన్య కళాశాలలో బి.కాం ఫైనలియర్‌ విద్యార్థి. కలుపుగోలుగా ఉండే హరీష్‌ది సున్నిత మనస్తత్వం. హరీష్‌ మరణంతో తల్లిదండ్రులు, అక్క, అన్న శోక సంద్రంలో మునిగిపోయారు,  
 
గోపీ ఏమయ్యావయా.. 
చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పాశం గోపిరెడ్డిది తండ్రి వెంకటేశ్వర రెడ్డి,మామూలురైతు. గోపిరెడ్డి, ఒక చెల్లెలు సంతానం. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల వేదన  వర్ణనాతీతం. చేతికంది వచ్చిన కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, తమలా కాకుండా మంచి ఉద్యోగం చేయాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి చదివిస్తున్నామని, మంచి ఉద్యోగం చేస్తాడని అనుకుంటే తమపై విధికి కన్నుకుట్టిందని విలపించారు. 
 
హరీ ఆశలన్నీ నీపైనే..∙
నందిగామకు చెందిన కొమ్మవరపు హరిగోపి తండ్రి రమణారావు కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. శుభ కార్యాలకు డోలు సన్నాయి వాయిస్తూ  బతుకు బండిని లాగుతున్నారు. మృతుడు హరిగోపికి చెల్లెలు కూడా ఉంది. కొడుకును ప్రయోజకుణ్ణి చేయాలన్న పట్టుదలతో కష్టమైనా శక్తికి మించి కొడుకును చదివిస్తున్నాడు. ఊహించని దుర్ఘటనతో తల్లిదండ్రులు కుమిలికుమిలి రోదిస్తున్నారు. 
 
లోకేషా.. అండగా ఉంటావనుకుంటే.. 
నందిగామ పట్టణానికి చెందిన కూచి లోకేష్‌ తండ్రి శ్రీనివాసరావు డ్రైవర్‌గా పనిచేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇరువురు మగ పిల్లల్లో లోకేష్‌ పెద్ద కుమారుడు. కొడుకులు ప్రయోజకులైతే శేష జీవితం హాయిగా, ఆనందంగా గడుస్తుందని భావించిన శ్రీనివాసరావుకు పెద్ద కుమారుడి మరణం అశనిపాతమైంది. కుమారుడి మృతదేహం వద్ద అతను రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. 
 
ఎంతపని చేశావ్‌ నగేషా..
వీరులపాడు మండలం, జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్‌ది సామాన్య మధ్య తరగతి కుటుంబం. నగేష్‌ తండ్రి రాజగోపాలాచారి వెల్డింగ్‌ వర్క్‌ చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయని. నగేష్‌కు అక్క కూడా ఉంది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కొడుకు తిరిగి రాని లోకాలకు తరలిపోవడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
 
ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి..
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా బాధిత తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పుష్కర స్నానానికి వచ్చి మృతిచెందగా, ఈతకు వచ్చి చనిపోరని పుకార్లు రావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వచ్చి ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. సబ్‌ కలెక్టర్‌ సృజన తీరుపైనా అసహనం వ్యక్తం చేశారు.

 

>
మరిన్ని వార్తలు