ఐదు వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు

3 May, 2016 17:50 IST|Sakshi

ఐదు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఎంపిక చేసిన 600 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు వారం రోజులపాటు వ్యాయామ విద్యపై జరుగనున్న శిక్షణా తరగతులను మంగళవారం ఏఎన్‌యూలో మంత్రి ప్రారంభించారు.

 

కార్యక్రమం అనంతరం విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు.  ఫిజికల్ లిటరసీతోపాటు స్పోర్ట్స్ లిటరసీ ఆవశ్యకతను కూడా గుర్తించాలన్నారు. వ్యాయామ విద్య, క్రీడల ప్రాధాన్యతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మార్కుల్లో వెయిటేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విశాఖపట్నంలో వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు.



 సింహాచలంలో 99 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్, లంబసింగిలో స్పోర్ట్స్ స్కూల్, అరకులో ఆర్చరీ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అప్‌గ్రేడేషన్ ఫైల్‌కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని త్వరలో దీనిపై సానుకూల ఉత్తర్వులు వెలువడతాయన్నారు. అవసరమైన పాఠశాలల్లో ఔట్‌సోర్సింగ్ తదితర మార్గాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమిస్తామన్నారు. డీఎస్సీ 2014 అభ్యర్థులకు జూన్ ఒకటో తేదీ కల్లా నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. వారికి 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని అనంతరం ప్రతిజ్ఞ కూడా చేయించనున్నామన్నారు.


ఏఎన్‌యూ వీసీ నుంచి నివేదిక:
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పదోన్నతులు, నియామకాల్లో అవకతవకలు జరిగాయనే అంశాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్‌ను కోరామన్నారు. వీసీ వ్యక్తిగత పనుల వల్ల విశాఖపట్నంలో ఉన్నారని ఆయన రాగానే నివేదిక ఇస్తారని దాని ఆధారంగా చర్యలు చేపడతామన్నారు.

మరిన్ని వార్తలు