జిల్లాకు ఐదు మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌లు

1 Jan, 2017 23:33 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాకు ఐదు మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌లు మంజూరైనట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ వి.రవీంద్రనాథఠాగూర్‌ తెలిపారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టిసిపేటరీ (పీపీపీ) పద్ధతిలో వాటిని కేటాయించారన్నారు. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ పశుశాఖ డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున మంజూరైనట్లు తెలిపారు. పశుసంపద, జీవాలకు సోకే సీజనల్, అంటు వ్యాధుల నిర్మూలనకు అవసరమేతై మారుమూల గ్రామాలకు వెళ్లి సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన సిబ్బంది, అన్ని రకాల మందులు, వ్యాక్సినేషన్లు అందుబాటులో పెడతామని తెలిపారు. పశుగ్రాస భద్రత విధానం (ఫాడర్‌ సెక్యూరిటీపాలసీ)లో గడ్డి పెంపకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

ఇకముందు పశుగ్రాసం కొరత అనేది ఏర్పడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. అంతేకాకుండా రాయితీతో గడ్డి, దాణా ఇచ్చేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. సోమవారం నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో గ్రామగ్రామాన పశు శిబిరాలు ఏర్పాటు చేసిన కృత్రిమ గర్భోత్పత్తి, చూడి కోసం మందులు ఇస్తామన్నారు. అలాగే జీవాలకు ఉచిత నట్టల నివారణ మందులు తాపించడం జరుగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు