పరిటాల సునీత వర్సెస్ ఎమ్మెల్యే సూరి

27 Oct, 2016 09:37 IST|Sakshi
పరిటాల సునీత వర్సెస్ ఎమ్మెల్యే సూరి
  • ధర్మవరంలో ఫ్లెక్సీ పంచాయితీ
  • సునీత ఫ్లెక్సీని తొలగిచేందుకు సూరి అనుచరుల యత్నం
  • అడ్డుకున్న పరిటాల వర్గం
  •  పోలీసు స్టేషన్‌ ఎదుటే ముష్టియుద్ధం
  •  పట్టణంలో ఉద్రిక్తత,  144 సెక్షన్‌ అమలు

  • టీడీపీలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఇన్నాళ్లూ చాపకింద నీరులా దాగి ఉన్న తమ్ముళ్ల అసహనం బుధవారం ధర్మవరంలో జరిగిన  ఘటనతో బట్టబయలైంది. కేవలం ఓ ఫ్లెక్సీ కోసం మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) అనుచరులు బాహాబాహీకి దిగడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    ధర్మవరం : స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ల ఫొటోలతో బత్తలపల్లి మండలం గంటాపురానికి చెందిన జగ్గు అనే టీడీపీ నాయకుడు ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. అయితే ఆ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే  వరదాపురం సూర్యనారాయణ ఫొటో వేయించలేదు. ఇది చూసిన ఎమ్మెల్యే అనుచరులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  తమ నాయకుడు ఫొటో లేని ఫ్లెక్సీ అక్కడ ఉంచరాదని భావించి దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడే ఉన్న గంటాపురం, సి.బత్తలపల్లి, ఓబుళనాయునిపల్లి గ్రామాలకు చెందిన పరిటాల వర్గీయులు ఫ్లెక్సీ తొలగింపును  అడ్డుకున్నారు.

    దీంతో ఇరు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలవారు తమ  అనుచరులను పోలీస్‌ స్టేషన్‌ వద్దకు పిలిపించుకున్నారు. దీంతో భారీఎత్తున జనాలు గుమికూడారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు మరోసారి మంత్రి ఫ్లెక్సీలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలవారు పోలీసుల ఎదుటే ముష్టి యుద్ధానికి దిగారు. ఒకరి చొక్కాలు ఒకరు చించుకొని, పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరీ వర్గీయులు ఫ్లెక్సీని కొంతమేర చించేశారు. దీంతో పరిటాల వర్గీయులు ఫ్లెక్సీ ఎదుటే ౖబైఠాయించారు. ‘తాము ఇక్కడే కాపలాగా కూర్చుంటాం, ఎవరు వస్తారో చూస్తాం’ అంటూ ఫ్లెక్సీ ఎదుటే బైఠాయించారు. ఈ ఘర్షణ పెద్దది కావడం... జనం భారీగా గుమిగూడడంతో ఏం జరుగుతుందో తెలియక పట్టణవాసులంతా భయబ్రాంతులకు గురయ్యారు.

    ప్రేక్షక పాత్రలో పోలీసులు
    పోలీసు స్టేషన్‌ ఎదుటే అధికార పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో...పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసులందరినీ ధర్మవరానికి పిలిపించారు.  అయినప్పటికీ ఇరువర్గాల వారూ అధికార పార్టీ నేతలే కావడంతో ఎవరికీ ఏమీ చెప్పలేక పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. దీంతో రెచ్చిపోయిన సునీత, సూరి వర్గం పోలీసుల ఎదుటే వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే స్థానిక కళాజ్యోతి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మరో ఫ్లెక్సీకి వరదాపురం సూరి వర్గీయులు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వారి మాట పట్టించుకోలేదు.

    పట్టణంలో 144 సెక్షన్‌
    ఫ్లెక్సీ వివాదం తీవ్రమైన నేపథ్యంలో డీఎస్పీ వేణుగోపాల్‌ పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గురువారం కూడా 144 సెక్షన్ కొనసాగుతోంది. అలాగే పరిటాల సునీత ఫ్లెక్సీలకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వార్తలు